శ్రీ శివ మహా పురాణము - 360


🌹 . శ్రీ శివ మహా పురాణము - 360 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

93. అధ్యాయము - 05

🌻. మేనాదేవి వరములను పొందుట - 3 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -

మేనక చెప్పిన ఆ మాటను విని ప్రసన్నమగు మనస్సు గల ఆ దేవి ఆమె యొక్క మనోరథమును పూర్ణము చేయు చున్నదై, చిరునవ్వుతో నిట్లనెను (37).

దేవి ఇట్లు పలికెను -

నీకు బలశాలురగు వందమంది కుమారులు జన్మించ గలరు. వారిలో అతిశయించిన బలము గలవాడు, ప్రధానుడు అగు పుత్రుడు ఒకడు ముందుగా జన్మించగలడు (38). నీ భక్తికి నేను సంతసించితిని. నేను నీకు కుమార్తెనై జన్మించి, దేవతలందరిచే ఆరాధింపబడు దాననై దేవకార్యమును నిర్వర్తించెదను (39).

బ్రహ్మ ఇట్లు పలికెను -

జగన్మాతా, శివపత్నియగు ఆ కాలికా పరమేశ్వరి ఇట్లు పలికి మేనక చూచుచుండగనే అచటనే అంతర్థనమాయెను (40).ఓ కుమారా! మేనకయు మహేశ్వరి నుండి అభీష్టమగు వరమును పొంది సాటిలేని ఆనందమును పొందెను. తపస్సు చేసినందు వలన కలిగిన శ్రమ అంతయూ మటుమాయమయ్యెను (41).

ఆమె పరమేశ్వరి అదృశ్యమైన దిక్కునకు నమస్కరించి మిక్కిలి ఆనందించిన మనస్సు గలదై, జయశబ్దము నుచ్చరించుచూ తన గృహమును ప్రవేశించెను (42). అపుడామె తాను పొందిన గొప్ప వరమును గూర్చి భర్తతో చెప్పెను. ఆమె ముఖ లక్షణములను బట్టియే భర్తకు సంగతి తెలియుచుండెను. అయిననూ ఆమె ఆ వృత్తాంతమును భర్తకు పదే పదే చెప్పెను (43).

శైలరాజగు హిమవంతుడా మేనా దేవి యొక్క ఆ వచనమును విని మిక్కిలి సంతసించి, ఉమాదేవి యందు స్థిరమగు భక్తిగల ఆ ప్రియురాలిని ప్రీతితో ప్రశంసించెను (44). ఓ మహర్షీ! వారిద్దరు కలిసి కాపురము చేయుచుండగా కొంత కాలమునకు మేన గర్భవతి ఆయెను. ఆమె గర్భము దినదిన ప్రవర్థమానమాయెను (45). భవిష్యత్తులో సముద్రునితో గాఢమగు మైత్రిని నెరపి, నాగకన్యలతో భోగింపబోవు, మైనాకుడనే పేరుగల అద్భుతమగు పుత్రరత్నమును ఆమె కనెను (46). పర్వతములకు రెక్కెలుండుటచే ప్రాణినాశము జరిగెడిది. దానిపై కోపించిన ఇంద్రుడు వజ్రముతో పర్వతముల రెక్కలను దనుమాడెను. ఓ దేవర్షీ! కాని ఈ మైనాకుని రెక్కలను మాత్రము ద్రుంచలేదు. మైనాకుడు శ్రేష్ఠమగు అంగములతో విరాజిల్లెను (47).

హిమవంతుని వందమంది పుత్రులలో మైనాకుడు శ్రేష్ఠుడు, గొప్ప బల పరాక్రమములు గలవాడు, హిమవంతుని కుమారులగు పర్వతములన్నింటిలో ఇతనికి మాత్రమే పర్వతరాజు అను స్థానము తగియున్నది (48). ఆ హిమవంతుని రాజధానిలో అద్భుతమగు మహోత్సవము ప్రవర్తిల్లెను. ఆ దంపతులిద్దరికీ కష్టములు తొలగి అతిశయించిన ఆనందము కలిగెను (49). వారు బ్రాహ్మణులకు దానమునిచ్చిరి. ఇతరులకు కూడా ధనమును పంచియిచ్చిరి. వారిద్దరికీ ఉమా పరమేశ్వరుల పాదపద్మముల యందు అధికమగు ప్రీతి కలిగెను (50).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందలి పార్వతీ ఖండములో మేనక వరములను పొందుట అనే అయిదవ అధ్యాయము ముగిసినది (5).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


28 Feb 2021

No comments:

Post a Comment