భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 242


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 242 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 6 🌻


40. జ్ఞాని ముక్తుడైన తర్వాత అతడికి చ్యుతి లేదు. అందుకనే వారికి పరీక్షలు పెడితే – అప్సరసలు, ఇంద్రాదులు వాళ్ళను పరీక్షచేయబోయి వాళ్ళే భంగపడ్డారు. జ్ఞానులను ఏదీ భ్రమపెట్టలేదు.

41. బ్రహ్మవస్తువు దర్శనమైన తరువాత ఈ సృష్టిలో అతడిని భ్రమపెట్టగలిగినది ఇంకొకటి లేనేలేదు. సృష్టిలో ఎవరినైనా బాధించేది బాహ్యదృష్టి, రక్షించేది అంతర్దృష్టి. బాహ్య దృష్టి బాధిస్తుంది, బంధిస్తుంది. బాహ్యదృష్టే సహజమైతే, వాడు బద్ధుడు. ముక్తుడు కాడు.

42. బాహ్యదృష్టి కలిగి అది సహజంగా ఉండి, సహజదృష్టి వేరే ఉంటే, అతడిని బాహ్యదృష్టి బాధించదు. సహజంగా బాహ్యదృష్టి కలిగిన బద్ధుణ్ణి అంతర్దృష్టి రక్షిస్తుంది. ఈ అంతర్దృష్టిని అలవాటుచేసుకునే కాలంలో బాహ్యదృష్టిని ఉపసంహారంచేసే ప్రయత్నం పేరే సాధన.

43. అంతర్దృష్టిసాధన అంటే బాహ్యదృష్టి వైముఖ్యము. దీనినే సాధన అంటారు. ఇంద్రియాలను నిగ్రహించుకునే ప్రయత్నం, కామక్రోధాదులను జయించే ప్రయత్నం – ఇట్లాంటి ప్రయత్నమే సాధన అనబడుతుంది.

44. కానీ ఆత్మదర్శన సాధన చేస్తున్నానని చెప్పకూడదు. ఆత్మసర్శనం అసలు ఉండదక్కడ. బాహ్యదృష్టి నిర్మూలనమవుతుందంతే. ఇది సర్వులకూ సాధ్యమే! సంసారం అంత భయంకరమయినది, అంత బలమయినదీ అనుకోకూడదు. అది కేవలం బలహీనుడి విషయంలో మాత్రమే చాలా బలమైనది.

45. ఆసురీ సంపత్తి దైవీ సంపత్తి ఉన్నవారినే వచ్చి బాధిస్తుంది కాని, అది దానికి అహారం దొరకక్ కాదు. దానికి కావలసిన ఆహారం చాలాచోట్ల ఉంది కాని, ఈ జ్ఞానులను తింటే వచ్చే రుచి ఇంకెక్కడా ఉండదు! అది దాని తత్త్వం. దనిని చూచి కూడా ఉపేక్షించాలి. ఎందుచేతనంటే, ఆసురీసంపత్తికి దైవిసంపత్తిమీద స్వేషం ఉంటుందికాని, దైవీసంపత్తికి దానిపై ద్వేషం ఉంటుందా! ఉండదు. ఇది దాన్ని ఉపేక్షిస్తుంది.

46. ఆశ్రమంలో దుష్టుడు క్షేమంగా ఉంటాడు. బయట ఉండలేడు. అందుకే దానిని ఆశ్రయిస్తాడు. ప్రపంచంలో ఇదంతా సహజంగానే జరుగుతూ ఉంటుంది. భగవంతుడు హీనుడైన పూజారి దృష్టిలో అక్కడ లేడు. లేనేలేడాతడికి. ఉన్నాడనుకున్నవాడికి ఉన్నాడంతే.

47. ఎందుకంటే, శిథిలాలలో ఉండే గబ్బిలం శిథిలాలలోనే క్షేమంగా ఉంటుంది. బాగా పెద్ద లైటు వెలిగిచేటటువంటి దివ్యభవనాలలోకి వెళితే చంపేస్తారు దానిని. ఒక్కొక్కదానికి సృష్టిలో ఒక్కొక్క స్థానం కల్పించబడి ఉంది. అది అక్కడ క్షేమంగా ఉంటుంది, ఆ స్థానం కోల్పోతే స్థానబలిమి పోతుంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


28 Feb 2021

No comments:

Post a Comment