శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 222 / Sri Lalitha Chaitanya Vijnanam - 222


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 222 / Sri Lalitha Chaitanya Vijnanam - 222 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా ।
మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ ॥ 55 ॥


🌻 222. 'మహాబలా'🌻


మహత్తరమగు బలము కలది శ్రీలలిత అని అర్థము.

బలమను పదమునకు చాల అర్థములు కలవు. గంధమందలి సువాసనలను బలమందురు. రసమును బలమందురు. రసమనగా రుచి. ఇంద్రియముల రుచి ఇంద్రియబలము. గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, సమయస్ఫూర్తి, బుద్ధిబలము, స్థిరత్వము, మనోబలము, ఆనందము, సంతోషము జీవుని బలము.

ఇట్లు రసము అనేక రుచులద్వారా జీవునికి బలమిచ్చు చుండును. రుచి బలమైనది గనుకనే బలహీనులు వానికి లోబడుదురు. వానిని లోబరచుకొన్న జీవుడు బలవంతుడు. అతడే బలుడు.

బలమనగా రూపమని కూడ అర్థము కలదు. బలమగు రూపములు గలవారిని కూడ బలులందురు. బలరాముడు, భీముడు, ఘోటోత్కచుడు, కుంభకర్ణుడు బలమగు రూపములు కలవారు. రూప బలము కూడ బలమే. రూపమున అందము కూడ బలమే. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి వారిది రూపమున గల సౌందర్య బలము. అట్లే సీతాదేవి, ద్రౌపదీ దేవి కూడ.

బలమనగా జీవ బలమని కూడ అర్థము కలదు. ఎట్టి కష్ట నష్టములనైననూ నోర్చుచూ జీవించు జీవులుందురు. వారిది జీవ బలము. భరింపరాని కష్టనష్టములను కూడ భరించుట బలమే కదా! ధర్మరాజు, నలుడు ఈ కోవకు చెందినవారు. వీరు జీవమునందు బలము కలవారు. మహత్తరమైన సేనలు కలవారు కూడ బలవంతులే.

అట్లే మహత్తరమగు సద్గుణములు కలవారు కూడ బలవంతులే. రాక్షస రాజగు వైరోచనుడు దాన బలము కలిగి చక్రవర్తియై బలిచక్రవర్తిగా పేరు గాంచెను. నిజమునకు అతడు బలి అనియే తెలియబడును. గాని అతని నిజనామము కొందరికే తెలియును. 

దాన గుణమే బలముగ అతడు వ్యాప్తి చెంది భూమికి చక్రవర్తి అయ్యెను. బలి అని పేరు గాంచెను. ఇట్లనే కానేక బలములు ఇన్ని విధములుగ ఇందరి యందు భాసించుటకు మూలకారణము శ్రీమాత బలమే. ఆమె మహాబల గావున బలమెచ్చట నున్ననూ, అది ఆమె అస్థిత్వమే అని తెలియ వలెను.

కాకియందు బలమున్నదని సామాన్యముగ మనము గ్రహించము. కాకులు చండుడను మహర్షి కుమారులు. వారు ఇరువది ఒక్కరు. వారు ప్రతిదినము బ్రాహ్మీకాలమున శ్రీదేవిని చిరకాలము పూజించిరి. ధ్యానించిరి. సమాధి స్థితిని పొందిరి.

అపుడు శ్రీదేవి అనుగ్రహించి వారికి ప్రత్యక్షమైనది. ముక్తి నొసగినది. ఈ విధముగ వాయసములు, వారి సంతతి ముక్తజీవులైనారు. ఈ కారణముగనే ముక్తి నపేక్షించుచూ కాకులకు అన్నము పెట్టుట సంప్రదాయముగ వచ్చినది. ముక్తి నొసగు బలము కాకులయందు నిక్షిప్తము చేయుటలో శ్రీమాత బల మాహాత్మ్యము తెలియనగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 222 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Mahā-balā महा-बला (222) 🌻

There are several meanings for the word vīrya. Generally it means courage, power, lustre, dignity, energy, etc. She is the reservoir of all these qualities and She provides these qualities to Her devotees depending upon the depth of devotion.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


28 Feb 2021

No comments:

Post a Comment