దేవాపి మహర్షి బోధనలు - 45


🌹. దేవాపి మహర్షి బోధనలు - 45 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 31. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 1 🌻

ఒక వేసవికాలంలో నేను లక్నో మహా నగరంలో యుండుట జరిగినది. వేసవి తీవ్రముగా నుండుటచే ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. జీవితములోని సమస్యలన్నియు మనోఫలకముపై మెదలి నన్ను తీవ్రముగా ఆందోళన పరచినవి. ఆరోగ్యము అంతంత మాత్రముగ నుండిన దినములవి. భరింపరాని శిరోవేదన యుండెడిది. జీవిత భాగస్వామి కొరకై తీవ్రమైన ఆవేదన యుండెడిది. తలకు మించిన బాధ్యత యుండెడిది.

కలగాపులగముగా యీ సమస్యలన్నియూ ఒక్కుమ్మడిగా దాడి చేసినవి. వీటికి తోడు లక్నో నగరమున రాత్రి సమయమున దోమల దాడి కూడా జరుగుచుండెడిది. నిద్ర శూన్య మగుటచే విశాలమగు వరండాలోనికి వచ్చి అటునిటు తచ్చాడు చుంటిని. అకస్మాత్తుగా ఒక పెద్ద వెలుగు మెఱపువలె అవతరించినది. నేనున్న చోటునంతటినీ నింపినది. నా గురుదేవుని వాణి వినిపించినది. రూపము కన్పింపలేదు. నేను శ్రద్ధతో ఆయన వాణి వింటిని. వారిట్లు పలికిరి.

“నీవు అనవసరముగా చింతించుచున్నావు. చింతవలన నీకేమియూ ఉపకారము జరుగదు. నీ మనోభావములను, వాక్కులను, చేతలను నే నెప్పటికప్పుడు పరిశీలించుచునే యున్నాను.

ఈ జీవితమున నీవొనర్చవలసిన దివ్యకార్యము అతి త్వరలో నిన్ను చేరును. నీవా కార్యము నారంభింపగలవు. కాని, ఆరంభింప బడు తీరు మాత్రము నీవు తెలియగ లేవు. నీవు గుర్తించలేని విధముగా అది ప్రారంభమగును.”

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


28 Feb 2021

No comments:

Post a Comment