శ్రీ శివ మహా పురాణము - 346
🌹 . శ్రీ శివ మహా పురాణము - 346 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
88. అధ్యాయము - 43
🌻. దక్షయజ్ఞ పరిసమాప్తి -1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
విష్ణువు, నేను, దేవతలు, ఋషులు, మరియు ఇతరులు ఇట్లు స్తుతించగా, మహా దేవుడు మిక్కిలి ప్రసన్నుడాయెను (1). అపుడు శంభుడు ఋషులు, దేవతలు, బ్రహ్మ, విష్ణువు మొదలగు వారి నందరినీ సమాధానపరచి దక్షునితో నిట్లనెను (2).
మహాదేవుడిట్లు పలికెను -
ఓయీ దక్ష ప్రజాపతీ! నేను చెప్పు మాటను వినుము. నేను ప్రసన్నడనైతిని. నేను స్వతంత్రుడను, సర్వేశ్వరుడను అయినప్పుటికీ నిత్యము భక్తులకు వశములో నుండెదను (3). ఓయీ దక్ష ప్రజాపతీ! నాల్గు రకముల పుణ్యాత్ములు నన్ను నిత్యము సేవించెదరు. వీరిలో వరుసగా ముందు వానికంటె తరువాతి వాడు శ్రేష్ఠుడు (4). ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని అను నల్గురు నన్ను సేవింతురు. మొదటి ముగ్గురు సామాన్య భక్తులు కాగా, నాల్గవవాడు సర్వశ్రేష్ఠుడు (5).
వారిలో జ్ఞాని నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. జ్ఞాని నా స్వరూపమేనని వేదములు చెప్పుచున్నవి. కావున జ్ఞానికంటె నాకు ఎక్కువ ప్రియమైనవాడు లేడు. నేను ముమ్మాటికీ సత్యమును పలుకుచున్నాను (6).
ఉపనిషత్తుల తాత్పర్యము నెరింగిన జ్ఞానులు ఆత్మజ్ఞుడనగు నన్ను జ్ఞానముచే పొందెదరు. జ్ఞానము లేకుండగనే నన్ను పొందుటకు యత్నించువారు మూర్ఖులు (7). మూర్ఖులు, కర్మాధీనులు అగు మానవులు నన్ను వేదములచే గాని, యజ్ఞములచే గాని, దానములచే గాని, తపస్సుచే గాని పొందలేరు (8). నీవు కేవలకర్మతో సంసారమును తరింప గోరితివి.అందువలననే నేను కోపించి యజ్ఞమును విధ్వంసము చేసితిని (9). ఓదక్షా! ఈనాటి నుండి నన్ను పరమేశ్వరునిగా ఎరింగి, బుద్ధిని జ్ఞానార్జన యందు లగ్నము చేసి, శ్రద్ధతో కర్మను అనుష్ఠించుము (10).
ఓ ప్రజాపతీ! మరియొక మాటను చెప్పెదను . మంచి బుద్ధితో వినుము. నేను నా సగుణ స్వరూపమునకు సంబంధిచిన రహస్యమును ధర్మ వృద్ధి కొరకై నీకు చెప్పెదను (11). నేను బ్రహ్మ విష్ణు రూపుడనై జగత్తుయొక్క పరమకారణ మగుచున్నాను. నేను ఆత్మను. ఈశ్వరుడను. ద్రష్టను. స్వయంప్రకాశుడను. నిర్గుణుడను (12). ఓప్రజాపతీ!అట్టి నేను నా మాయను స్వాధీనము చేసుకొని జగత్తు యొక్క సృష్టి స్థితిలయములను చేయుచూ, ఆయా క్రియలకు తగిన నామములను ధరించుచున్నాను (13). అద్వితీయము, ఆత్మరూపము, ఏకము అగు పరబ్రహ్మ యందు ప్రాణులు, బ్రహ్మ, ఈశ్వరుడు అను భేదములను అజ్ఞాని దర్శించును (14).
మానవుడు తన దేహములోని తల, చేతులు మొదలగు అవయవముల యందు తన పాండిత్యముచే భేద బుద్ధిని కలగియుండుట లేదు గదా ! అదే విధముగా నా భక్తుడు ప్రాణుల యందు భేద బుద్ధిని కలిగియుండును (15). ఓ దక్షా! సర్వప్రాణుల ఆత్మలు ఒక్కటియే అను భావన గలవాడై, త్రిమూర్తులలో భేదమును ఎవడు గనడో, వాడు శాంతిని పొందును (16). ఎవడైతే త్రిమూర్తులలో భేదబుద్ధిని కలిగి యుండునో,అట్టి మానవాధముడు చంద్రుడు నక్షత్రములు ఉన్నంత వరకు నరకమునందు నివసించుట నిశ్చయము (17). ఏ వివేకి నా యందు భక్తి గలవాడై దేవతల నందరినీ పూజించునో, వాడు జ్ఞానమును పొంది, దాని ప్రభావముచే శాశ్వతమగు ముక్తిని పొందును (18).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
11 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment