✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 10
🍀 10. ఆత్మజ్ఞానము -2 - నిరాశి : - ఆశ గలవానికి ఆత్మ సంయమము కుదరదు. ఆశ ఉన్నంత కాలము జీవుడు బాహ్యముననే జీవించును గాని అంత రంగమున చేరజాలడు. కనుక తీరని కోరికలు, ఆశలు గలవారు ధ్యానముకు వలసిన ప్రాథమిక అర్హతను కోల్పోవుదురు. అపరిగ్రహః - యోగ సాధకుడు ఇతరుల నుండి లబ్ధిపొందు బుద్ధి కలిగి యుండ రాదు. తా నితరులకు చేయు హితము, తా నితరుల నుండి పొందు హితము కన్న మిక్కుటమై యుండవలెను. యత చిత్తాత్మా : - నియమింపబడిన చిత్తము గలవాడై యుండవలెను. అందులకు కృషి చేయవలెను. ఆశ యతచిత్తము నకు వ్యతిరేకము. అట్లే పరిగ్రహము కూడ. 🍀
2. నిరాశి :
ఆశ గలవానికి ఆత్మ సంయమము కుదరదు. పంచభూతాత్మకమైన బహిరంగమందు ఆశ, ఆసక్తి సాధకుని అంత రంగ ప్రవేశమునకు అవకాశము కలుగనీయదు.
ఆశ వలన ప్రజ్ఞ బహిర్ముఖ మగుచుండగ, అంతర్ముఖుడెట్లు కాగలడు? ఆశ ఉన్నంత కాలము జీవుడు బాహ్యముననే జీవించును గాని అంత రంగమున చేరజాలడు. కనుక తీరని కోరికలు, ఆశలు గలవారు ధ్యానముకు వలసిన ప్రాథమిక అర్హతను కోల్పోవుదురు. ధ్యానము పేరున అట్టివారు చేయు కృషి యంతయు వృథా ప్రయాసయే అగును. ఈ విషయము తెలియవలెను.
3. అపరిగ్రహః :
ఇతరులను, ఇతరుల పదను తమ కొరకు వినియోగించు వారు కర్మబద్ధు లగుదురు. ఉచితముగ ఇతరుల సహకారమును అందుకొనువారు ఋణగ్రస్తులు కాగలరు. గ్రహించుట, పరిగ్రహించుట ఆత్మసంయమమునకు విరుద్దములు. దానము చేయుట, త్యాగము చేయుట దోహద కారకములు.
యోగ సాధకుడు ఇతరుల నుండి లబ్ధిపొందు బుద్ధి కలిగి యుండ రాదు. తా నితరులకు చేయు హితము, తా నితరుల నుండి పొందు హితము కన్న మిక్కుటమై యుండవలెను. విలువగల వస్తువులు గాని, వెండి బంగారములు గాని, ధనముగాని, బహుమతులుగ స్వీకరించరాదు. అట్లు స్వీకరించినను తక్షణమే సద్వినియోగము చేయవలెను. స్వంతమునకు వినియోగింపరాదు.
4. యత చిత్తాత్మా :
నియమింపబడిన చిత్తము గలవాడై యుండవలెను. అందులకు కృషి చేయవలెను. ఆశ యతచిత్తము నకు వ్యతిరేకము. అట్లే పరిగ్రహము కూడ. అందువలననే నిరాశ, అపరిగ్రహము యతచిత్తమునకు ప్రధానమైన లక్షణములుగ ఈ శ్లోకమున పేర్కొనబడినది.
నిజమునకు యతచిత్తము వలయు నన్నచో అహింస, సత్యప్రవర్తనము, బ్రహ్మచర్యము, దొంగబుద్ధి లేకుండుట, అపరిగ్రహము, బాహ్యశుచి, అంతఃశుచి, సంతోషము,
నిత్య పఠనము, ఈశ్వర ప్రణిధానము ప్రధానమని పతంజలి మహర్షి బోధించెను. అట్టి వానికే స్థిరము, సుఖము అగు చిత్త స్థితి కలుగునని తెలిపెను. భగవద్గీతయందు కూడ ముందు శ్లోకములలో ఈ విషయములే తెలుపబడినవి. ఆత్మజ్ఞానమునం దాసక్తి గలవారు సున్నితముగ పై తెలిపిన నియమములను పాటించుటకు త్రికరణ శుద్దిగ శ్రమించవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
06 Mar 2021
No comments:
Post a Comment