🌹 . శ్రీ శివ మహా పురాణము - 366 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
96. అధ్యాయము - 08
🌻. నారద హిమాలయ సంవాదము - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
శివజ్ఞాని, శివలీలలనెరింగిన వారిలో శ్రేష్ఠుడు అగు నీవు ఒకనాడు శివునిచే ప్రేరేపింపబడినవాడై, ఆనందముతో హిమవంతుని గృహమునకు వెళ్లితివి (1).
ఓ మహర్షీ! నారదా! ఆ పర్వత రాజు నిన్ను చూచి నమస్కరించి పూజించెను. మరియు తన కుమార్తెను పిలిపించి నీ పాదములపై బడవైచెను (2). ఓ మహర్షీ! హిమవంతుడు నీకు చేతులు ఒగ్గి శిరసును బాగుగా వంచి మరల నమస్కరించిన వాడై, ఈ ప్రసంగమును తన విధిగా భావించెను (3).
హిమవంతుడిట్లు పలికెను -
ఓ మహర్షీ ! నారదా ! ప్రభూ! నీవు బ్రహ్మ పుత్రులలో శ్రేష్ఠుడవగు జ్ఞానివి. నీవు
సర్వము నెరింగిన దయామూర్తివి. నీకు పరోపకరమునందు ప్రీతి మెండు (4). నా కుమార్తె యొక్క జాతకమును, దానిలోని గుణదోషముల వలన కలుగబోవు పరిణామములను చెప్పుము. భాగ్యవంతురాలగు నా కుమార్తె ఎవని ప్రియురాలు కాగలదు?(5)
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! పర్వతరాజగు హిమవంతుడిట్లు పలుకగా, నీవు కాళికా దేవి యొక్క హస్తమును, విశేషించి సర్వాయవములను పరిశీలించితివి (6). వత్సా! ఉత్కంఠను రేకెత్తించువాడు, వాగ్విశారదుడు, జ్ఞాని, వృత్తాంతము నంతనూ ఎరింగిన వాడు అగు నీవు సంతసించిన హృదయము గలవాడవై హిమవంతునితో నిట్లంటివి (7).
నారదుడిట్లు పలికెను -
ఓ పర్వతరాజా! ఈ నీ కుమార్తె పెరిగి సర్వలక్షణములతో కూడినదై చంద్రుని ప్రతిపత్కళ వలె ప్రకాశించుచున్నదని తలంచుచున్నాను (8). ఈమె తన భర్తకు అతి శయించిన సుఖమునిచ్చి, తల్లి దండ్రుల కీర్తిని పెంపొందించ గలదు. ఈమె అన్ని అవస్థలయందు మహా పతివ్రతయై, సర్వదా మహానందము నీయగలదు (9).
ఓ పర్వతరాజా! నీ కుమార్తె యొక్క చేతియందు మంచి లక్షణములన్నియూ కనిపించుచున్నవి. మరియు ఒక విలక్షణమైన రేఖ గలదు. దాని యథార్థ ఫలమును వినుము (10). యోగి, దిగంబరుడు, నిర్గుణుడు, వీతరాగుడు, తల్లి దండ్రులు లేని వాడు, అహంకార విహీనుడు, అమంగళ##వేషధారి అగు వాడు ఈమెకు భర్త కాబోవు చున్నాడు సుమా! (11).
బ్రహ్మ ఇట్లు పలికెను -
మేనా హిమవంతులనే ఆ దంపతులు నీ మాటను విని, సత్యము స్వీకరించి, మిక్కిలి దుఃఖించిరి (12). ఓ మహర్షీ! ఆ జగన్మాత కూడ నీ ఈ మాటను విని, ఆ లక్షణములను బట్టి ఆతడు శివుడేనని నిర్ణయించుకొని హృదయములో గొప్ప ఆనందమును పొందెను (13).
ఆ శివా దేవి నారదుని వచనము అసత్యము కాబోదని తలంచి, అపుడు మనస్సులో శివుని పాదపద్మములపై అతిశయించిన ప్రేమను నింపుకొనెను (14). ఓ నారదా! అపుడా పర్వతరాజు దుఃఖితుడై నీతో నిట్లనెను. ఓ మహర్షీ! నేనేమి ఉపాయమును చేయవలెను. నాకు మహాదుఃఖము కలుగుచున్నది (15).
నారదుడిట్లు పలికెను -
ఓ పర్వత రాజా! నేను ప్రేమతో చెప్పు మాటను వినుము. నా మాట సత్యము. నా మాట ఎన్నటికీ అసత్యము కాదు. బ్రహ్మచే నిర్మించబడిన చేతిలోని రేఖలు నిశ్చయముగా అసత్యము గావు (17). హే పర్వత రాజా! ఈమె భర్త అట్టి వాడగు ననుటలో సందేహము లేదు. కాని ఈ విషయములో ఒక ఉపాయమును వినుము. అట్లు చేసినచో, నీవు సుఖమును పొందగలవు (18).
లీలారూపధారియగు శంభుప్రభుడు అట్టి వరుడై యున్నాడు. కాని ఆయన యందలి చెడు లక్షణములన్నియూ సద్గుణములతో సమానము (19). ఆ ప్రభువు నందు దోషము దుఃఖకారి కాదు. ఆ దోషమే ప్రభువు కంటె ఇతరుల యందున్నచో మహాదుఃఖమును కలిగించును. దీనికి సూర్యుడు, అగ్ని, గంగానది దృష్టాంతములని తెలియదగును (20).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
06 Mar 2021
No comments:
Post a Comment