దేవాపి మహర్షి బోధనలు - 51


🌹. దేవాపి మహర్షి బోధనలు - 51 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 34. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 1🌻


జ్వాలకూల్ మహర్షిగారి బోధనలను ప్రపంచమున కందించుటకు నే నాయనకు వ్రాయసకతా నైతిని. Initiation, Human and Solar అను గ్రంథము పూర్తయినది. అప్పటికొక నెలరోజులు గడచినవి.

ఈ కార్యక్రమమును తలచుకొనునపుడల్లా నాలో ఒక ఆందోళన కలుగుచుండెడిది. ప్రపంచము నన్ను ఒక మతిభ్రమించిన దానివలె భావించునేమో! అను భయమేర్పడినది. అందువలన నేనిక యీ పని చేయగూడదని నిర్ణయించుకొంటిని. జ్వాల కూల్ మహర్షికి నా ఆవేదన నిట్లు తెలిపితిని.

“నాకు ముగ్గురు కుమార్తెలున్నారు. వారిది చాలా పిన్న వయస్సు. వారికి నేనే ఆధారము. మీరు నడిపించుచున్న కార్యమున నాకు పిచ్చి కలుగునేమో! అనారోగ్యమేర్పడునేమో! అను భయము తీవ్రముగ నున్నది. అందువలన నేను మీ గ్రంథరచనా మహాయజ్ఞము నకు తోడ్పడజాలను.” పై విధముగా తెలుపగా జ్వాల కూల్ మహర్షి అంగీకార సూచకముగ తలయూపి యిట్లని సలహా యిచ్చిరి.

“నీ సహకారము నిరాకరించుటకు ముందు నీవొకసారి నీ గురుదేవుని సంప్రదించుము.” ఈ విషయమున నా గురుదేవులు దేవాపి మహర్షిని సంప్రదించవలెనా? వలదా? అను తర్జన భర్జన ఒక వారము నాలో సాగినది. అటుపైన గురుదేవులను సంప్రదించవలెనని నిర్ణయము చేసుకొని, వారిని ప్రార్థించితిని.

వారి సాన్నిధ్యము లభించినది. తన సాన్నిధ్యము కొరకు నే నెట్లు ప్రార్థింప వలెనో నా గురుదేవులు నాకు నిర్దిష్టముగ తెలిపియున్నారు. దాని ననుసరించి ప్రార్థించితిని. ఈ ప్రార్ధన అత్యంత బాధ్యతాయుతమైనది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


06 Mar 2021

No comments:

Post a Comment