కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 41


🌹.  కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 41  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి - 5 🌻

మీరందరూ తప్పక ఈ విమర్శ చేసేటటువంటి విధానములన్నింటిలో పూర్ణజ్ఞానమును పొందాలి. ఏమిటవి? పంచకోశ విచారణ, దేహత్రయ విచారణ, శరీరత్రయ విచారణ, అవస్థాత్రయ విచారణ, జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ విచారణ, ధ్యాన ధ్యాతృ ధ్యేయ విచారణ, జడచేతన విచారణ, ఆధార ఆధేయ విచారణ, నిత్యానిత్య విచారణ, అత్మానాత్మ విచారణ, కార్యకారణ విచారణ, సదసద్ విచారణ, దృగ్ దృశ్య విచారణ - ఇలాంటివాటన్నింటినీ పూర్తిచేయాలి.

ఇవన్నింటినీ ఎప్పుడైతే నీవు పూర్తి చేస్తావో, వీటన్నింటిలో నుండి వచ్చేటటువంటి అనుభవం ఏదైతే వుందో, ఆ అనుభవం నిన్ను ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి దగ్గర చేస్తుంది. అది పొందేటటువంటి స్థితికి నిన్ను చేరుస్తుంది. అందుకని వీటన్నింటినీ బాగా నీకు అధ్యయనం చేయిస్తారనమాట. ఈ అధ్యయనం చేయించడం వల్ల - సాంఖ్య విచారణలో వున్నటువంటి విశేషణం ఇదే -

ఈ సాంఖ్య విచారణలో ఇవన్నీ చేయడం ద్వారా నీలో ఏవేవి దూరం అవ్వాలో, నీలో ఏవేవి నిరసింపబడాలో, ఏయే వాటి నుంచి నీవు అధిగమించాలో, వాటన్నింటినీ నీవు అధిగమించిన స్థితిలో నిలబడతావనమాట. తత్ ప్రభావం చేత నీకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. ఈ రకంగా నడిపేటప్పుడు అనుభవజ్ఞానం చాలా ముఖ్యము. అందుకని - ఎందుకని అంటే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మము.

ఎందుకని ఆ మాట అంటున్నారంటే ఆత్మ సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. ఇక ఆత్మ కంటే సూక్ష్మమైనది లేదనమాట. అది సర్వ వ్యాపకము. అన్నింటికంటే సూక్ష్మము. మరి చిహ్నముల ద్వారా దానిని ప్రత్యక్షమయ్యేటట్లు చెయ్యగలుగుతామా? అంటే అర్ధం ఏమిటీ? సరే.

ఇక్కడి నుంచి ఇప్పుడున్న వ్యవస్థలో అనేక దేశాలలో అనేక రకాలైనటువంటి చిహ్నాల ద్వారా ఈ జ్ఞానాన్ని దివ్యత్వాన్ని వ్యక్తీకరించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కాని అవేవీ సత్యానికి ఆత్మానుభూతిని నిర్ణయించలేవు. అంటే అర్ధం ఏమిటీ?

ఒకాయన ఒక చేతిలో కొబ్బరికాయ పట్టుకుని వుంటాడు. ఒకాయన దానిని తీక్షణంగా చూస్తూ వుంటాడు. చూడగా చూడగా చూడగా చూడగా చూపు ద్వారా దానిని ప్రేరేపించడం ద్వారా చేతిలో వున్న కొబ్బరికాయ క్రిందపడిపోతుంది.

ఇప్పుడు ఆయనకి ఆత్మానుభూతి వున్నట్లేనా? ఒకాయన కళ్ళకు గంతలు కట్టుకుని తన ఎదురుగుండా వున్నటువంటి పుస్తకంలో వున్న వేదాన్ని అంతా చదివేస్తాడు. దీన్ని బ్లైండ్ రీడింగ్ [blind reading] అంటారు. మరి ఆయనకి ఆత్మానుభూతి వున్నట్లేనా?

ఒకాయనకి దూరశ్రవణ విద్య. అంటే మనం ఫోన్ లో ఎట్లా మాట్లాడుకుంటున్నామో, ఆయన ఫోన్ సహాయం లేకుండా తెలుసుకో గలుగుతాడు. అలాంటి దూరశ్రవణ విద్య వున్నటువంటివాళ్ళు వుంటారు.

అలాగే కొంతమందికి ఏదైనా ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకి సమాధానం ఇన్వొకింగ్ – ఇంట్యూషన్ [invoking – intuition] అంటారు దీన్ని. ఈ ఇంట్యూషన్ [intuition] ద్వారా చెప్పేటటువంటి విధానం ఒకటి వుంటుంది. అలాగే కొంతమందికి ట్రాన్సెన్-డెన్టల్ [Transcendental Meditation] అంటారు.

అంటే ఒకరి చేతిలో వాహకంగా పనిచేసేటటువంటి నిబద్ధత కొంతమంది మానసిక వ్యవస్థలలో వుంటుంది. అట్టి మానసిక వ్యవస్థ కలిగినటువంటి వాళ్ళు - తప్పక ఏం జరుగుతుందంటే - ఆ మానసిక వ్యవస్థల నుంచి వాళ్ళు ప్రేరణని పొంది, ఆ ప్రేరణ ద్వారా వాళ్ళు సమాధానాన్ని చెప్తూ వుంటారు.

ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మ ప్రజ్ఞా పరిధిలో. ఈ ప్రజ్ఞ కి చైతన్యానికి వున్నటువంటి వలయాలలో చిట్టచివరి వలయాలలో [outer periphery] ఉంటారనమాట. అంటే సూక్ష్మం అనగానే ఇలాంటివన్నీ మొదలైపోతాయనమాట.

సూక్ష్మం అనగానే అనేకరకాలైన శక్తులు, అనేకరకాలైనటువంటి స్థూలానికి అతీతమైనటువంటి - అతీత శక్తులు అతీత శక్తులు అంటారు - దేనికి అతీతం అంటే స్థూలానికి అతీతం.

అంటే మన కళ్ళు, మన చెవులు, మన ముక్కులు, మన స్పర్శ, మన నోరు ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు తెలుసుకోగలిగినదానికంటే అతీతమైనటువంటిది. అవతలిది. అలాంటిదేదైనా వచ్చినపుడు వాళ్ళు అవి చేయగలుగుతారనుకోండి.

మరి వీటి ద్వారా ఆత్మ వున్నదని నిరూపించదగునా అంటే అట్లాంటివాటి వల్ల ఆత్మ యొక్క సాక్షాత్కార జ్ఞానాన్ని పొందలేము. అత్మానుభూతిని పొందలేము.

మరి ఎలాగండీ నిరూపణ అంటే ఇదంతా గ్రుడ్డివాడు ఏనుగును పట్టుకున్న రీతి. వాళ్ళు పట్టుకున్నది ఏనుగును కాదా? ఏనుగు లక్షణాలు కావా అంటే ఒకానొక అంశీభూతములే.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

31.Aug.2020

No comments:

Post a Comment