🌹. సనాతన ధర్మం లో బహుళ విశ్వ భావనలు : 🌹


*🌹. సనాతన ధర్మం లో బహుళ విశ్వ భావనలు : 🌹*
*✍️. ---భట్టాచార్య, మణి శర్మతో........* 
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻. Science and Spirituality 🌻*

*🌻. బహుళ విశ్వాలు – సమాంతర విశ్వాలు :- 🌻*

ఈ విశ్వం ఒక్కటేనా? లేక అపరిమితంగా విస్తరిస్తున్న అసంఖ్యాక 'బహుళ విశ్వాల్లో (మల్టీవర్స్‌) ఇదొకటా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే విషయంలో ఖగోళ శాస్త్రవేత్తలు రెండుగా చీలిపోయారు. కొందరు అవునని, కొందరు కాదనీ తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఖగోళ శాస్త్రవేత్తల్లో కొందరి వాదన ప్రకారం బిగ్‌ బ్యాంగ్‌ తర్వాత ఈ విశ్వం అపరిమితంగా విస్తరించడం ప్రారంభించింది. చాలా భాగాల్లో ఈ విస్తరణ కొనసాగుతుండగా, కొన్నిచోట్ల మాత్రం నిలిచిపోయింది. ఇలాంటి అసంఖ్యాక విశ్వాలను మహాసాగరంలోని 'బుడగలు'గా శాస్త్రవేత్తలు వర్ణిస్తున్నారు.

   మనకి సమాంతరమైన విశ్వం ఇంకొకటి ఉండే అవకాశం ఉందంటున్నారు డాక్టర్ బ్రైన్ గ్రీన్ అనే శాస్త్రవేత్త.


 *🌻. ది హిడెన్ రియాలిటి: 🌻*

 పారలల్ యూనివర్స్, డీప్ లాస్ ఆఫ్ కాస్మోస్” అనే పుస్తకం రాసిన ఆయన ఇచ్చిన ఒక టివి ఇంటర్వూలో నిరంతరం చలనశీలంగా ఉన్న ఈ ఖగోళ విశ్వంలో, మన ప్రపంచం పక్కనే ఇంకొక ప్రపంచం ఉండవచ్చని చెప్పారు.

        ఖగోళాంతరాలలో ఉన్న ఎన్నో విశ్వాలలో మన విశ్వం ఒకటనీ, వీటిలో కనీసం ఒకటి మన ప్రపంచానికి మిల్లీమీటరు దూరంలో వున్నా వుండవచ్చని డాక్టర్ బ్రైన్ గ్రీన్ లాగా ఎంతోమంది ఖగోళశాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. మన పక్కనే ఉన్నా మన ఇంద్రియాలకు ఈ విశ్వం ఉన్నట్లు అనుభవం అవ్వదు. ఎందుకంటే ఇది మన కళ్ళకి కనిపించే మూడు డైమెన్షన్ (3 dimensions) లకు అతీతంగా ఉంది.

        భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌, బెల్జియం పరిశోధకుడు థామస్‌ హెర్టాగ్‌తో కలసి వెలువరించిన తన చివరి పరిశోధనా పత్రంలో హాకింగ్ ‘బహుళ విశ్వ భావన’ను కొట్టిపారేయలేదు. అయితే ఆ ఖగోళాల సంఖ్యను తగ్గించాడు. చాలా స్వల్ప సంఖ్యలోనే అవి ఉంటాయన్నారు. సైద్ధాంతిక భౌతికశాస్త్రంలోని 'స్ట్రింగ్‌ థియరీ' అనే ఒక విభాగం ఆధారంగా ఈ సూత్రీకరణను చేశారు.

            22 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆండ్రోమెడా గేలక్సీ, మన పాలపుంత వైపు గంటకి 2 లక్షల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మనకి కనిపించని మరో విశ్వం యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల ఇలా రెండు గేలాక్సీలు దగ్గరవుతున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

        సమాంతర విశ్వాలకు సంబంధించిన ఈ అంతరిక్ష రహస్యాన్ని ఛేదించడానికి ప్రపంచమంతా ముందుకి వచ్చింది. ఎన్నో యూరోపియన్ యునియన్ దేశాలతో పాటు తైవాన్, చైనా, రష్యా, అమెరికా ఈ ప్రాజెక్టుకి సహాయపడుతున్నాయి.

        మనం ఇంకొక విశ్వానికి వెళ్ళి చూసి రావచ్చా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే శాస్త్రవేత్తలు ఈ విషయంపై ఇంకా పరిశోధించాల్సి ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే మన శరీర నిర్మాణంలో ఉండే గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంతత్వం మనని ఈ విశ్వానికి కట్టిపడేసి ఉంచుతాయి. అందువల్ల ఇంకొక విశ్వాన్ని చేరాలంటే ముందు వీటిని అధిగమించాల్సి ఉంటుంది. అవి మనని మన విశ్వంలోని నాలుగు డైమెన్షన్ ( పైన కింద, ముందు వెనక, కుడి ఎడమలు, దేశకాలం) నుండి బయటకి రానివ్వవు. మన పక్కనే ఇంకొక విశ్వం ఉండి ఉండచ్చు. కానీ దాన్ని అర్ధం చేసుకోవాలంటే వాటికున్న నిరూపకాలను లేక డైమెన్షన్ లను ముందు మనం అర్ధం చేసుకోవాలి. 

        సైన్స్ ఫిక్షన్ ఆలోచన నుంచి సైన్స్ చెప్పే నిజాల మధ్య ఆలోచిస్తే మన విశ్వంతో పాటు ఈ బ్రహ్మాండంలో మరెన్నో విశ్వాలున్నాయంటున్నారు శాస్త్రజ్ఞులు. ఈ అంశాన్నే “ప్యారలల్ యూనివర్సెస్” (సమాంతర విశ్వాలు) గా అభివర్ణిస్తున్నారు. దీని నుంచి వచ్చిందే “మల్టీవర్స్” (బహుళ విశ్వం) అనే అంశం కూడా.

        సుమారు 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ జగత్తు అంతా ఒక అనంతమైన ఏకత్వంతో నిండి ఉండేది. బిగ్ బాంగ్ సిద్ధాంతం ప్రకారం మనకు తెలియని ఏదో ప్రేరణ వల్ల అదంతా విస్తృతమై 3 డైమెన్షనల్‌గా విస్తరించింది. ఈ విస్తరణ బహుళ సంఖ్యలో ‘పాకెట్ యూనివర్సెస్’ రూపంలో జరిగి ఉండవచ్చని శాస్త్రజ్ఞుల భావన. ఇలా విస్తరించిన ఆ అపారమైన శక్తి అంతా చల్లబడిన తరువాత దాని గుండా కాంతి ప్రసారం జరిగిందని, క్రమంగా చిన్న చిన్న కణాలు, రేణువులన్నీ కలిసిపోయి పెద్ద పెద్ద భాగాలుగా ఏర్పడ్డాయని, శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ విశ్వంలోని సౌరకుటుంబాలు, నక్షత్రాలు, గ్రహాలు అలా ఏర్పడినవే. మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత మన విశ్వాన్ని దాటి గమనించడానికి అనుకూలంగా లేదు.

        ఈ బహుళ విశ్వ భావన, హైందవ విశ్వోద్భవ శాస్త్రానికేమీ కొత్త కాదు. ఈ భావనను తెలియజేసిన మన ప్రాచీన హిందూ గ్రంథాలలో భాగవతం మొదటిది. ఇందులో బహుళ విశ్వాల గురించి, వాటి మధ్య ఉండే సంబంధాల గురించి వివరించబడి ఉంది.

"వైదిక విశ్వోద్భవ శాస్త్రం ప్రకారం, లెక్కలేనన్ని విశ్వాలు ఉన్నాయి, ఇవి కారణ మహాసముద్రం (లేక కారణ వైకుంఠం) యొక్క ఉపరితలం మీద నురుగులాగా ఉంటాయి. ప్రతి విశ్వమూ ఒక కర్పరం చేత కప్పబడి ఉంటుంది. ఈ విశ్వాలన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఉన్నప్పటికీ వాటి మధ్య పరస్పర చర్య సాధ్యం కాదు.

"బ్రియాన్ పెన్ ప్రేస్"... అనే శాస్త్రవేత్త, భాగవత గ్రంథం లోని ఒక శ్లోకం (6.16.37) యొక్క అర్థాన్ని, తాను వ్రాసిన *“ది పవర్ ఒఫ్ స్టార్స్”* అనే గ్రంథంలో ఇలా వివరించాడు : 

*“ప్రతీ విశ్వాన్ని ఆవరించుకొని ఏడు పొరలు ఉంటాయి. అవి – భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, శక్తి మరియు అహం. ఇందులో ప్రతీ పొర లేక ఆవరణము తనకు ముందున్న పొర కన్నా పది రేట్లు పెద్దది గా ఉంటుంది. ఇలాంటి విశ్వాలు అసంఖ్యాకంగా ఉంటాయి. అవి అనంతమైన పరిమాణంలో ఉన్నప్పటికీ అవి నీలోని పరమాణువుల వలే చలిస్తూ ఉంటాయి. కాబట్టే నువ్వు (భగవంతుడు) అనంతుడవని చెప్పబడ్డావు.”*

*భాగవతం 3.11.41. ఇలా చెబుతుంది :“...అన్ని విశ్వాలూ సమావృతమై భారీ అణువుల సముదాయంగా కనబడతాయి.”*

*భాగవతం 10.14.11 ఇలా చెబుతుంది : “...... ధూళి రేణువులు ఎలాగైతే తెరిచి ఉంచిన కిటికీల గుండా ప్రవేశిస్తాయో, అలాగే అసంఖ్యాక విశ్వాలు నీ శరీరం యొక్క రోమ కూపాల గుండా ప్రవేశిస్తున్నాయి.*  

*భాగవతం 2-5-40-41 ఇలా చెబుతుంది:*
 *“ప్రియమైన పుత్రా నారదా! మొత్తం 14 లోకాలలో ఏడు లోకాలు అధో భాగంలో ఉన్నాయి. మొదటి లోకమైన ‘అతల’ నడుము పై ఉన్నది. రెండవదైన ‘వితల’ తొడలపై ఉన్నది. మూడవదైన ‘సుతల’ మోకాళ్ళపై ఉన్నది. నాలుగవదైన ‘తలాతల’ మోకాలు క్రింది భాగంలో, ఐదవదైన ‘మహాతలం’ కాలి మడమ పై, ఆరవదైన ‘రసాతలం’ పాదం యొక్క పై భాగంలో, ఏడవ దైన ‘పాతాళం’ అరికాలు లోనూ ఉన్నాయి. ఈ విధంగా భగవంతుని విరాట్ రూపం లో అన్ని లోకాలూ ఉన్నాయి.”*

మొత్తం పదునాలుగు లోకాలలో ఏడు ఊర్ధ్వ లోకాలు, ఏడు అథో లోకాలు గా చెప్పబడ్డాయి. 

ఏడు ఊర్ధ్వ లోకాలు – భూ, భువ, సువ, మహా, జనో, తపో, సత్య లోకాలు.

ఏడు అథో లోకాలు – అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు.

*మనం నివసిస్తున్న భూమి వంటివి ఈ సృష్టిలో కోటానుకోట్లు ఉంటాయని విష్ణు పురాణం చెబుతుంది. బ్రహ్మ వైవర్త పురాణంలో సమాంతర విశ్వ భావన కనిపిస్తుంది.*

పరమాత్మను “అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు” అని చెబుతారు. మనం నివసిస్తున్న భూమి ఒక సౌరమండలంలో ఉంది. అట్లాంటి ఎన్నో మండలాలు కలిస్తే ఒక ‘అండం’ అని అంటారు. అలాంటి అనంతమైన ఎన్నో అండాలు కలిస్తే ఒక ‘బ్రహ్మాండం’. అలాంటి అనంతమైన బ్రహ్మాండాలు కలిపితే అది “లీలా విభూతి” అని అంటారు. అయితే ఈ లోకాలన్నిటికీ సృష్టి, ప్రళయాలు ఉంటాయి.

*భగవంతుడు ఏర్పర్చుకున్న కార్య వైకుంఠం నుండి సృష్టి- స్థితి - లయాలు జరుగుతాయి. వీటన్నింటికీ కారణమైన ‘కారణ వైకుంఠం’ లేక ‘పరమపదం’ విరజ అనే నదికి అవల ఉంటుంది. అది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి దానిని "నిత్యం" అని వ్యవహరిస్తారు. దాన్నే ‘నిత్య విభూతి’ అని అంటారు. విరజా నదికి క్రింద ఉన్నది ‘లీలా విభూతి’, పైన ఉన్నది ‘నిత్య విభూతి’. నిత్య విభూతి లీలా విభూతికి మూడు రెట్లు ఉంటుంది. లీలా విభూతికి ఎంత క్రిందకు వెళ్ళినా అంతం ఉండదు. నిత్య విభూతికి పైన అంతం ఉండదు. అందుకే పరమాత్మకి ‘ఉభయ విభూతి నాయకుడు’ అని పేరు. విభూతి అంటే సంపద అని అర్థం.*

ఉపపరమాణు స్థాయిలో బహుళ విశ్వాలు లేక సమాంతర విశ్వాలు ఉంటాయని 'యోగ వాశిష్టం' చెబుతుంది. మనకు అనుభవంలోకి రాని అనేక నిరూపకాలు (dimensions) ఉన్నాయని, ఆ నిరూపకాలలో అనేక విశ్వాలుంటాయని, నేడు శాస్త్రవేత్తలు భావిస్తున్న 'బహుళ విశ్వ భావన' (Multiverse Theory) లేక 'సమాంతర విశ్వ భావన' (Parallel Universes) తో ఇది సరిపోలుతోంది.

వైదిక భౌతిక శాస్త్రం ప్రకారం మన విశ్వం లోని అంతరాళం బహు నిరూపకాలతో కూడినది. మన విశ్వంలో ప్రధానంగా 64 నిరూపకాలు ఉన్నాయని వైదిక వాఙ్మయం చెబుతుంది. ఇందులో ప్రతీ నిరూపకము అనేక ఉప నిరూపకాలుగా విభజింపబడి ఉంటుంది. భూలోక వాసులు 3 నిరూపకాలను కలిగిన ప్రపంచాన్ని మాత్రమే చూడగలరు లేదా అనుభూతి చెందగలరు. అంతకు మించి నిరూపకాల స్థాయిలో ఉన్న విశ్వం యొక్క వాస్తవికతను వారు తమ ఇంద్రియాల ద్వారా అనుభూతి చెందలేరు. అందుకే మనం ఎక్కువ నిరూపకాల స్థాయి కలిగిన లోకాలను, ఆ లోక వాసులను చూడలేక పోతున్నాము. అంతే కాక వైదిక భౌతిక శాస్త్రం ప్రకారం వివిధ స్థాయిలకు చెందిన లోకాలలో కాలం వివిధంగా ఉంటుంది. ఇదే విషయాన్ని ఐన్ స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతంలో వివరించారు.

వీటన్నిటినీ పరిశీలిస్తే ‘బహుళ విశ్వాలు’ లేక ‘సమాంతర విశ్వాలు’ అనే భావన వైదిక వాఙ్మయం లో ప్రాచీన కాలంలోనే చెప్పబడి ఉందని తెలుస్తోంది.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment