🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. దత్తాత్రేయ మహర్షి - 2 🌻
7. కర్మ అనేది దుఃఖానికి హేతువు. ‘మమ’ అనటం దుఃఖానికి, ‘న మమ’ అనటం విర్వృత్తికి మార్గములు.
8. అహంకారమనేటటువంటి అంకురముచే పుట్టి, మమకారము మొదలుగా కలిగి; గృహము, క్షేత్రము అనే కొమ్మలతో పెరిగి; కూతురు, భార్య అనేటటువంటి చిగుళ్ళతో; ధనము, ధాన్యము అనేటటువంటి పెద్దపెద్ద ఆకులు వేసి; పాపముణ్యములు అనేటటువంటి పుష్పములు పూచి; సుఖదుఃఖాలనేటటువంటి పండ్లు కాచి, చిరకాలము పెరిగి, అజ్ఞానము అనేటటువంటి కుదుళ్ళతో నిండి, ముక్తి మార్గాన్ని కప్పేసేటటువంటి ఈ ‘మమ’ అనేటటువంటి వృక్షము నీడను ఆశ్రయించి, ఈ సంసారంలో ఏదో సుఖముందని పరిశ్రాంతులయేటటువంటి మిథ్యాసుఖజ్ఞానులై, సుఖానికి ఆధీనులై ఉండేటటువంటి వాళ్ళకు పరమపదం అనగా మోక్షం అనేది దుర్లభం.
9. కాబట్టి నీవు ఆ మహావృక్షమును నిర్మలమయిన విద్య, సత్యజ్ఞానము అనేటటువంటి గొడ్డలి తీసుకుని చేదించుకో!” అని బోధించాడు. “తత్త్వనిధులైన సాధుజనులతో సంగం పెట్టుకో. అది పాషాణంవలె పనికొస్తుంది.
10. దానితో, విమలవిద్య అనే గొడ్డలిని పదునుపెట్టుకుని నీవు ఆ మహావృక్షాన్ని చేదించుకో, నాశనం చెయ్యి. అలాగ నీవు పునరావృత్తిని, అంటే మళ్ళీ జన్మలేని స్థితిని సంపాదించుకుంటావు” అని చెప్పాడు.
11. అలర్కుడు ఆయనను, “అలా అయితే నేను నిర్గుణమైన బ్రహ్మైకత్వం ఎలాగ పొందగలుగుతాను, దానిని గురించి చెప్పండి” అని అదిగాడు. “వత్సా! శరీరమునందలి పరమజ్ఞానమునకు గురుడే ఉపద్రష్ట. మోక్షానికి యోగము జ్ఞానపూర్వమౌతుంది.
12. ప్రకృతిగుణములతో ఏకత్వం లేకపోవతం, బ్రహ్మైకత్వం కలగటం ముక్తి అనవచ్చును. ఆ ముక్తి పరమయోగములో కలుగుతుంది. యోగము సంగత్యాగమువలన సిద్ధిస్తుంది.
13. సంగత్యాగమువలన నిర్మమత్వం, దానివలన వైరాగ్యం, దానివలన జ్ఞానం, దానివలన మోక్షం కలుగుతాయని చెప్పబడింది. యోగానికి ముందు ఆత్మను జయించాలి. అంటే తననుతాను జయించుకోవాలి. అది ప్రాణాయమంచేత మాత్రమే సాధ్యం.
14. కామమును వృద్ధిచేసేటటువంటి కర్మలు యోగాన్ని విఘ్నంచేసేవి సుమా అని తెలుసుకుని యోగి కామ్యకర్మలు విడనాడాలి. శుద్ధాత్ముడై పరమాత్ముడిలో ఐక్యం సాధించేందుకు సంసిద్ధుడు కావాలి. అలాంటివాడికి, ఈ లోకంలో, తాను ఆ సాధనలో ఉన్న సమయంలో, ఎవరన్నా తనను గౌరవిస్తే అది విషంగా ఉంటుంది. అవమానమే అమృతమవుతుంది. తను ఎక్కడ ఉంటే అదే ఇల్లవుతుంది.
15. కాబట్టి నీవు విచారంలేకుండా అటువంటి యోగబుద్ధితో మోక్షాన్ని అనుభవించూ అని బోధచేసాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
04 Oct 2020
No comments:
Post a Comment