రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
53. అధ్యాయము - 8
🌻. వసంతుడు - 1 🌻
సూతుడు ఇట్లు పలికెను -
ప్రజాపతి యగు బ్రహ్మ యొక్క ఈ మాటలను విని ప్రసన్నమగు మనస్సు గలవాడై ఆ నారదుడిట్లనెను (1).
నారదుడిట్లు పలికెను -
హే బ్రహ్మన్! విధీ! మహాత్మా! నీవు విష్ణుని శిష్యుడవు. మహా ప్రాజ్ఞుడవు. శివభక్తుడవు అగు నీవు ధన్యుడవు. నీవు పరమాత్మ తత్త్వమును కళ్లకు కట్టినట్లు చెప్పగలవు (2).
అరుంధతి గాథను, ఆమె పూర్వజన్మ వృత్తాంతముతో సహా వినిపించితివి. ఈ దివ్య గాథ శివభక్తిని వర్ధిల్లజేయును (3).
ఓ ధర్మజ్ఞా! పవిత్రము, శ్రేష్ఠము, మహాపాపములను పోగొట్టునది, మంగళములనిచ్చునది, ఉత్తమమైనది అగు శివచరితమును ఇప్పుడు చెప్పుము (4).
మన్మథుడు వివాహమాడి ఆనందించగా, వారందరూ తమ స్థానములకు వెళ్లగా, సంధ్య తపస్సు కొరకు వెళ్లగా, అప్పుడు ఏమైనది?(5).
సూతుడిట్లు పలికెను -
పవిత్రమగు అంతఃకరణము గల ఆ ఋషి యొక్క మాటను విని, బ్రహ్మ అత్యంత ప్రసన్నుడై ఇట్లు పలికెను (6).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ విప్రశ్రేష్ఠా! నారదా! శివుని లీలలతో గూడిన ఆ శుభచరితమును భక్తితో వినుము. శివుని సేవకుడవగు నీవు ధన్యుడవు (7).
వత్సా! పూర్వము శివుడి అంతర్ధానము కాగానే నేను మోహమును పొంది, ఆ శివుని వాక్యములనే విషముచే పీడింపబడి సర్వదా చింతిల్లెడివాడను (8).
శివుని మాయచే మోహితుడనైన నేను చిరకాలము మనస్సులో చింతిల్లి శివుని యందు ఈర్ష్యను పొందితిని. ఆ వృత్తాంతమును చెప్పెదను వినుము (9).
అపుడు నేను దక్షాదులు ఉన్న చోటకు వెళ్లితిని. అచట రతితో గూడియున్న మన్మథుని చూచి నేను కొంత గర్వమును పొందితిని (10).
ఓ నారదా! శివుని మాయచే మోహితుడనైన నేను దక్షుని, ఇతర కుమారులను మిక్కిలి ప్రీతితో పలకరించి, ఈ మాటలను పలికితిని (11).
బ్రహ్మ ఇట్లు పలికెను -
హే దక్షా! ఓ మరీచ్యాది కుమారులారా! నా మాటను వినుడు. విని నా కష్టమును దీర్చే ఉపాయము నాచరింపుడు (12).
నేను కాంతయందు అభిలాషను మాత్రమే ప్రకటించగా, అది చూచి, శంభుడు నిందించెను. మహాయోగి యగు శివుడు నన్ను మిమ్ములను బహువిధముల ధిక్కరించి నాడు (13).
ఆ కారణముచే నేను దుఃఖముతో వేగుచున్నాను. నాకెచ్చటనూ సుఖము లభించుట లేదు. ఆయన స్త్రీని వివాహమాడునట్లు మీరు యత్నించవలెను (14).
ఆయన స్త్రీని చెట్టబట్టిన నాడు నేను దుఃఖమును వీడి సుఖమును పొందెదను. కాని, విచారించి చూచినచో, ఈ నా కోరిక తీరేది కాదని తలంచెదను (15).
నేను ఒక స్త్రీని చూచి అభిలాషను మాత్రమే పొందితిని. అది చూచి శంభుడు నన్ను మునుల యెదుట గర్హించినాడు.ఆయన స్త్రీని ఏల గ్రహించును?(16).
ఆయన మనస్సులో ప్రవేశించి, యోగమార్గములో నుండు ఆయన మనస్సును చలింపజేసి, ఆయనకు మోహమును కలిగించగల స్త్రీ ఈ ముల్లోకములలో ఎవరేని గలరా?(17)
యోగీశ్వరుడగు ఆయనను మోహింప జేయుటలో మన్మథుడు కూడా సమర్థుడు కాజాలడు. ఆయన స్త్రీల పేరును గూడ సహించడు (18).
ఆది కారణుడగు శివుడు మన్మథుని బాణముల ప్రభావమును తిరస్కరించినచో, మధ్యమ సృష్టి ప్రథమ సృష్టి వలె నిరాటంకముగా ఎట్లు కొనసాగగలదు?(19).
భూలోకములో కొందరు మహాసురులు మాయచే బంధింపబడుచున్నారు. కొందరు హరిమాయచే, మరికొందరు శివుని మాయచే ఉపాయముగా బంధింపబడుదురు (20).
సంసారమునందు విముఖుడు, మహా విరాగి అగు శంభుని యందు ఈ మోహమును కలిగించుట అను పనిని మనము తప్ప మరియొకరు చేయజాలరు. దీనిలో సందేహము లేదు (21).
నేను దక్షుడు మొదలగు నా కుమారులతో నిట్లు పలికి, రతితో గూడియున్న మదనుని అచట గాంచి, సంతసించినవాడనై ఇట్లు పలికితిని (22).
ఓ కామా! నీవు నా పుత్రులలో శ్రేష్ఠుడవు. నీవు అన్ని విధములా సుఖమును ఇచ్చువాడవు. తండ్రియందు ప్రేమగల ఓ కామా! నీవు నీ భార్యతో గూడి నా మాటను ప్రీతితో వినుము (23).
హే మన్మథ! నీవీ భార్యతో గూడి ప్రకాశించుచున్నావు. ఈమె కూడ భర్తవగు నీతో గూడి మిక్కిలి ప్రకాశించుచున్నది (24).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
04 Oct 2020
No comments:
Post a Comment