శ్రీ శివ మహా పురాణము - 243




🌹 .   శ్రీ శివ మహా పురాణము - 243   🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

55. అధ్యాయము - 10

🌻. బ్రహ్మకు జ్ఞనోదయమగుట - 1 🌻

నారదుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! విధీ! మహాత్మా! శివుని యందు లగ్నమైన మనస్సు గల నీవు ధన్యుడవు. శంకర పరమాత్ముని పుణ్యచరితమును చెప్పితివి (1).

మన్మథుడు తన సహచరులతో మరియు రతితో గూడి తన ఆశ్రమమునకు వెళ్లగా ఏమి ఆయెను? నీవు ఏమి చేసితివి? ఆ చరితమునిప్పుడు చెప్పుము (2).

బ్రహ్మ ఇట్లు పలికెను -

నారదా! చంద్రమౌళి యొక్క చరితమును మిక్కిలి ప్రీతితో వినుము. దీనిని విన్నంత మాత్రాన మానవుడు కామక్రోధాది వికారములకు దూరము కాగల్గును (3).

తన అనుచరులతో కూడి మన్మథుడు తన ఆశ్రమమునకు వెళ్లిన తరువాత జరిగిన చరితమును చెప్పెదను. తెలుసు కొనుము (4).

నారదా! నా గర్వము తొలగిపోయెను. నా హృదయములో ఆశ్చర్యము కలిగెను. ఓ మహర్షీ! నా కోరిక తీరనందున నాకు ఆనందము కరువయ్యెను (5).

కామ క్రోధాది వికారములు లేని వాడు, జితేంద్రియుడు, యోగ పరాయణుడునగు ఆ శంకరుడు వివాహమాడే ఉపాయమేది అని నేను మనస్సులో పరిపరి విధముల తలపోసితిని (6).

ఓ మహర్షీ! అపుడు నేను గర్వము తొలగిన వాడనై, పరిపరి విధముల తలపోసి, శివస్వరూపుడు, నాకు తండ్రి అగు విష్ణువును భక్తితో స్మరించితిని (7).

మరియు, దీన వచనములతో గూడిన స్తోత్రములతో ఆయనను స్తుతించితిని. వాటిని విని విష్ణుభగవానుడు వెంటనే నా ఎదుట ప్రత్యక్షమయ్యెను (8).

నాల్గు భుజములు గలవాడు, పద్మముల వంటి కన్నులు గలవాడు, శంఖమును, శార్‌ఙ్గమనే ధనస్సును, గదను ధరించినవాడు, ప్రకాశించే పచ్చని వస్త్రము గలవాడు, నీలమేఘశ్యాముడు, భక్తవత్సలుడు (9),

భక్తులకు శరణునొసంగువాడు అగు ఆ హరిని చూచి కన్నీరు విడుచుచూ, గద్గదమగు వాక్కుతో ప్రేమపూర్వకముగా అనేక పర్యాయములు స్తుతించితిని (10).

ఆ స్తోత్రమును విని తన భక్తుల దుఃఖములను తొలగించే హరి మిక్కిలి ప్రసన్నుడై, శరణు పొందిన నన్ను ఉద్దేశించి ఇట్లు పలికెను (11).

విష్ణువు ఇట్లు పలికెను -

హే విధీ! బ్రహ్మన్‌! సృష్టికర్తవగు నీవు మహా ప్రాజ్ఞుడవు, ధన్యుడవు. ఈనాడు నీవు నన్ను స్మరించి, స్తుతించుటకు కారణమేమి? (12).

నీకు కలిగిన మహాదుఃఖము ఏది? నాకు ఇప్పుడు చెప్పుము. నీ సర్వదుఃఖములను పోగెట్టెదను. నీకు సంశయముఅక్కరలేదు (13).

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు యొక్క ఈ మాటలను విన్న నా ముఖములో కొద్ది ఉత్సాహము కన్పట్టినది. నేను దోసిలి యొగ్గి విష్ణువునకు నమస్కరించి ఇట్లు పలికితిని (14).

ఓ దేవ దేవా! లక్ష్మీపతీ! మర్యాదను నిలబెట్టువాడా! నా మాటను వినుము. విని, దయను చూపి, దుఃఖమును పోగొట్టి , సుఖమునిమ్ము (15).

నేను రుద్రుని మోహింపజేయుట కొరకై కాముని పంపితిని. హే విష్ణో! ఆతడు మారగణములతో, వసంతునితో, భార్యతో మరియు సహచరులతో గూడి వెళ్లెను (16).

వారు అనేక ఉపాయములను చేసిరి. కానిఅవి నిష్ఫలమయ్యెను. యోగి, సమదర్శి యగు శివునకు వ్యామోహము కలుగలేదు (17).

సర్వజుడు, శివతత్త్వమును బాగుగా నెరింగినవాడు అగు విష్ణువు నా మాటను విని, ఆశ్చర్యమును పొంది నాతో ఇట్లనెను (18).

విష్ణువు ఇట్లు పలికెను -

హే పితామహా! నీకు ఇట్టి ఆలోచన కలుగుటకు కారణమేమి? హేబ్రహ్మన్‌! నీవు మంచి బుద్ధితో సర్వమును ఆలోచించి నాకు సత్యమును చెప్పుము (19).

బ్రహ్మ ఇట్లు పలికెను -

తండ్రీ! ఆ చరిత్రను వినుము. నీ మాయ మోహింపజేయును. జగత్తంతయూ దానికి వశమై సుఖదుఃఖాదుల యందు లగ్నమై యున్నది (20).

ఆ మాయచే ప్రేరితుడనై నేను పాపము చేయనొడగట్టితిని. ఆ వృత్తాంతమును వినుము. హే దేవదేవా! నీ ఆజ్ఞచే చెప్పు చున్నాను (21).

సృష్ట్యాది యందు నాకు పది మంది దక్షుడు మొదలగు కుమారులు, ఒక కుమార్తె జన్మంచిరి. అతి సుందరియగు ఆమె నా వాక్కు నుండి జన్మించిరి (22).

వక్షస్థ్సలము నుండి ధర్ముడు, మనస్సు నుండి మన్మథుడు, ఇతరకుమారులు దేహమునుండి జన్మించిరి. హేహరే! ఆ కుమార్తెను చూచిన నాకు మోహము కలిగినది (23).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


09 Oct 2020

No comments:

Post a Comment