గీతోపనిషత్తు - 49


🌹.  గీతోపనిషత్తు - 49  🌹

🍀  9. ధర్మచక్రము - మరణము గాని, సృష్టిలయము గాని జీవునికి ముక్తస్థితి ప్రసాదింపలేవు. అనుభవ పూర్వకముగ ధర్మమే గతియని తెలిసి నిరహంకారుడై దాని ననుసరించిన వాడే ముక్తమార్గమున మరల ప్రయాణము సాగించగలడు.  🍀

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.  కర్మయోగము - 16    📚


ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయ తీహ యః |

అఘాయు రింద్రియారామో మోఘం పార్థ స జీవతి || 16


1. ఏవం ప్రవర్తితం చక్రం :

సృష్టి చక్రమున ధర్మచక్ర మొకటి యున్నది. ఆ ధర్మ చక్రమున నిలచినవారు బ్రహ్మము నందు నిలచి అక్షరులై దీపించు చున్నారు. ఆ ధర్మ చక్ర మిట్లున్నది.

2. బ్రహ్మము నుండి వేదము పుట్టును. వేదము నుండి సృష్టి పుట్టును. సృష్టితో పాటు సృష్టి ధర్మమునూ పుట్టుకను సృష్టి ధర్మము ననుసరించుచు ఏర్పడును. అదియే సృష్టికర్మ. పై సమస్తమును యజ్ఞార్థమే. సృష్టియందలి జీవులు గూడ అదే యజ్ఞార్థ ధర్మమును అనుసరించుచు మరల బ్రహ్మమును చేరుదురు.

3. ధర్మ మాధారముగ ఈ చక్రము తిరుగుచుండును. ఈ చక్రము ననుసరించి ఎవరు జీవింతురో వారు బ్రహ్మము నుండి దిగివచ్చినవారై, సృష్టి వైభవమును అనుభవించుచు మరల బ్రహ్మమును చేరుదురు. అనుసరింపని వారు ధర్మచక్రము నుండి విడివడుటచే బంధముల చిక్కుకొని దుఃఖముల ననుభవించు చున్నారు.

ధర్మచక్రమును వీడినవారు మనస్సు, ఇంద్రియములు, శరీరమునందు బంధింపబడి భోగములయందు చిక్కుకొని ఎడతెరపి లేక నానావిధ యోనుల యందు జన్మ మెత్తుచున్నారు. వీరందరు సృష్టి ప్రయాణమున రైలుబండి దిగినవారివలె గమ్యము చేరక ప్రయాణమాగి వ్యర్థముగ జీవించుచున్న వారిగ తెలియ వలెను.

సృష్టి చక్రమునగల ధర్మచక్రము వృత్తాకారపు రైలుమార్గము వంటిది. ఈ మార్గమున రైలుబండి నెక్కిన జీవులు ధర్మమును ఆచరించుచు ప్రయాణము సాగించుచుండవలెను. ప్రయాణమునకు నియమములు వేద మేర్పరచిన శాశ్వత ధర్మములే. వానిని అనుసరించనివారు ఈ రైలుబండి నుండి దింపివేయ బడుదురు.

అది కారణముగ ప్రయాణమాగును. మరల ప్రయాణము సాగించవలె నన్నచో ధర్మనియమములను అనుష్ఠానము చేయ వలసిన బుద్ధి ఏర్పరచుకొనవలెను. లేనిచో వ్యర్థజీవనము సాగుచుండును. సృష్ట్యంతమున వీరు లయము చెందినను మరల బ్రహ్మమునుండి దిగివచ్చినపుడు అదే స్వభావముతో, అదే విధమైన అధర్మ ప్రవర్తనముతో మరల బంధింపబడుదురు.

మరణము గాని, సృష్టిలయము గాని జీవునికి ముక్తస్థితి ప్రసాదింపలేవు. అనుభవపూర్వకముగ ధర్మమే గతియని తెలిసి నిరహంకారుడై దాని ననుసరించినవాడే ముక్తమార్గమున మరల ప్రయాణము సాగించగలడు. ధర్మమునకు ప్రమాణము వేదము. వేదమునకు ప్రమాణము ఋషులు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


09 Oct 2020

No comments:

Post a Comment