🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 5 🌻
37. అలా పుట్టిన బ్రహ్మర్షులలో- మొదటివారు సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనేవాళ్ళు నలుగురు పుట్టారు. వాళ్ళు ఈ సృష్టికి ఉపక్రమం చేయాలని ఆయన ఉద్దేశ్యం. ఆ బ్రహ్మ మనసులోంచి నేరుగా పుట్టినవాళ్ళు వాళ్ళు. అందుకని వారిని బ్రహ్మమానసపుత్రులు అన్నారు.
38. ఆయన సంకల్పమేదయినప్పటికీ; తపస్సులో ఆత్మజ్ఞాన స్వరూపుడై విష్ణుతత్త్వాన్ని గురించి ధ్యానంచేసి ఉండిఉండటం చేత, అతడికి కర్తవ్యం ఏమిటో తెలిసింది.
39. తనలో ఉండే బ్రహ్మజ్ఞానం, సహజంగానే, తననుండి పుట్టిన వాళ్ళలోనూ ఉంది. ఈ బ్రహ్మజ్ఞానం వాళ్ళలో ఉన్నంతసేపూ వాళ్ళు సృష్టి నియుక్తులు కాలేరు. బ్రహ్మజ్ఞానం ఈ సృష్టిలో సమస్తకార్యాలకూ అవరోధంగా విముఖంగా పరిణమిస్తుంది. అది సృష్టి విస్తరణ సంకల్పం వాళ్ళళ్ళో పుట్టనివ్వదు. కాబట్టి ఆ నలుగురూ సృష్టిచేయలేదు.
40. వాళ్ళు బ్రహ్మజ్ఞానం చేత కలిగినటువంటి ఒక మహానందస్థితిలోకి వెళ్ళిపోయారు.
మరికొంతకాలానికి, తన సంకల్పం నెరవేరటానికి తన వామపాదంలోంచి స్వాయంభూమనువును, శతరూప అనే సుందరిని బ్రహ్మ సృష్టించాడు. ఆ రెండవబ్రహ్మయొక్క లక్ష్యం ఏదయితే ఉన్నదో – దాని ప్రకారం ప్రకృతీ-పురుషుడూ ఇద్దరూ ఉండాలికదా! అందుకనే, ఆయనతోపాటు శతరూపనుకూడా సృష్టించాడు.
41. స్వయంభూ మనువు- శతరూపలలో అవిద్యను ప్రవేశపెట్టాడు బ్రహ్మ. బ్రహ్మజ్ఞానంలో విస్మృతి -అవిద్య అంటే, ఇక ఉండేది సృష్టి జ్ఞానమే. అజ్ఞానం అనే వస్తువులేదు. కాబట్టి బ్రహ్మవస్తువు యొక్క ఆ పరిజ్ఞానం, ఆ ప్రజ్ఞ వాళ్ళల్లో మాయావృతం అయి; శతరూప స్త్రీగా స్వయంభూ మనువుకు కనబడుతుంది, నచ్చుతుంది. బాగుంది అనిపిస్తుంది. అలాగే శతరూపకుకూడా అనిపిస్తుంది.
42. ఇదే అవిద్య యొక్క ప్రారంభం అనుకోవటమే. ఆ తరువాత సృష్టిక్రమం ప్రారంభమయింది.
వాళ్ళదగ్గరినుంచే సమస్త క్షత్రియకులములూకూడా స్వయంభూమనువుకు పుట్టారట! తరువాత చతుర్ముఖుడు తన ఫాలభాగంనుంచీ ఏకాదశరుద్రులను సృష్టించాడట. వాళ్ళందరూ క్రోధమూర్తులయ్యారట.
43. ఆ తరువాత ఆ కమలాసనుడు తన చెవులలోంచి పులస్త్యపులహులనే ఋషులను సృష్టించాడు. నేత్రములలోంచి అత్రిక్రతువులను సృష్టించాడు. నాసికనుంచి సూర్యుడిని, ముఖంనుంచి అంగిరసుణ్ణి సృష్టించాడు. దక్షిణ వామ పార్శ్వముల నుంచీ భృగువు, దక్షులను; గ్రీవమునుండి నారదుణ్ణి పుట్టించాడు. నారదుడు పుట్టగానే తన తల్లితండ్రులను చూచాడు.
44. మొట్టమొదట అతడు బ్రహ్మనుచూస్తే, ఆయనేమో తపస్సులో ఉన్నాడు. ఆయన పలుకలేదు. అమ్మవారుమాత్రం తనవైపు వాత్సల్యంతో చూస్తోంది, సరస్వతీదేవి-శారదాదేవి. ఆమె దగ్గరికి వెళితే, ఈతడికి గానవిద్యను ఇచ్చింది. ఆ సంగీతవిద్యను – గానవిద్యను – ఆయన తీసుకుని దానిని అభ్యసించి ఉత్తీర్ణుడయ్యాడు. ఇంతలో లోకాలన్నీ సృష్టించబడ్డాయి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
09 Oct 2020
No comments:
Post a Comment