కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 71




🌹.   కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 71   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము -01 🌻

ఇప్పుడు ఆత్మను తెలుసుకొను విధము చెప్పబడుచున్నది.

పరమాత్మ మిక్కిలి సూక్ష్మ పరిమాణముగల శ్యామాదికము కంటెను మిక్కలి సూక్ష్మమైనది. మహత్‌ పరిమాణము గల ఆకాశాదికము కంటే మిక్కిలి మహత్తరమైనది. సర్వవ్యాపకమగుట చేత పిపీలికాది బ్రహ్మపర్యంతము వ్యాపించి ఉన్నది.

అందుచేత అణువుకంటే అణువుగాను, మహత్తుకంటే మహత్తుగాను ఉన్నది. మరియు ప్రాణుల బుద్ధి గుహయందు లేక హృదయాకాశమునందు ఈ ఆత్మ ఉన్నది. అట్టి ఆత్మను తన హృదయాకాశమున సాక్షాత్కారము చేసికొనటకు ఆ క్రతువు అనగా నిష్కామ కర్మలను ఆచరించువాడు కాంచుచున్నాడు.

ఎందుచేత ననగా వేద విహిత కర్మలను ఫలాపేక్షలేక, ఆచరించువాని చిత్తము నిర్మలమగును. ఎప్పుడు ఇంద్రియములు, మనస్సు నిర్మలమగునో అప్పుడు వాని బుద్ధియూ ప్రసన్నముగా నుండును. బాహ్యవిషయముల నుండి మరలిన బుద్ధి మాత్రమే పరమాత్మ మహిమను తెలిసికొనును. ఇట్లు తెలుసుకొనిన వాని శోకము నశించును, ఆత్మానందము అనుభవించును.

ఆత్మ యొక్క విధానమును తెలుసుకోవటానికి, ఆత్మను తెలుసుకొనే విధానాన్ని విస్తారంగా చెప్పేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించారు యమధర్మరాజు గారు నచికేతుని ద్వారా. పరమాత్మ మిక్కిలి సూక్ష్మ పరిమాణముగల శ్యామాదికము కంటెను మిక్కిలి సూక్ష్మమైనది. ‘శ్యామాదికము’ - అనే ఉపమానము వేశారు ఇక్కడ. ‘శ్యామాకాశ్చమే’ - అని నమకం, చమకం అనే రుద్రంలో వస్తుంది.

అంటే, అర్థం ఏమిటంటే జడ చేతన సృష్టిలో, జడ సృష్టి అయినటువంటి వృక్షములు ప్రథమ విత్తనము. దాని పేరు శ్యామకము అని పేరు, శ్యామాకాశ్చమే.. మరొక వాచ్యార్థంలో శ్యామకము అంటే ‘చామదుంపలు’ అని కూడా అర్థం. అంటే ప్రథమముగా ఏర్పడినటువంటి దుంప ఏదైతే ఉందో, ఏదైతే మరల మరల పుట్టడానికి అనుకూలమైనటువంటి అవకాశం ఇచ్చేటటువంటి విత్తనం ఏదైతే ఉందో, ఆ విత్తనం కంటే కూడా మిక్కిలి సూక్ష్మమైనటువంటిది.

మర్రి విత్తనంలో మర్రిచెట్టు దాగి వుంది. మర్రి విత్తనం ఆవగింజ అంత వుంది. కానీ మర్రి చెట్టు మహావృక్షం. మరి ఈ ఆవగంజంత ఉన్నటువంటి విత్తనం లోపల, అంత పెద్ద మర్రి చెట్టు ప్రావిర్భవింప చేయగలిగేటటువంటి శక్తి ఆ విత్తనంలో ఇమడ్చబడివుంది.

కాబట్టి పదార్థము కంటే శక్తి సూక్ష్మమైనది. శక్తి కంటే ఆధారభూతమైనటువంటి చైతన్యము సూక్ష్మము. చైతన్యము కంటే ఆత్మ సూక్ష్మము. ఆత్మ కంటే పరమాత్మ మిక్కిలి సూక్ష్మమైనది.

కాబట్టి, ఈ రకంగా సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అనేటటువంటి స్థాయీ భేదములతో... ఇది వివరించ పూన బడుతుంది. ఎంత సూక్ష్మ తరమైతే, అంత వ్యాపక ధర్మాన్ని కలిగి వుంటుంది. ఈ అంశాన్ని మనము వైజ్ఞానిక శాస్త్రంలో కూడా నిరూపించాము.

ఉదాహరణ: ఎక్స్‌ రే కిరణాలు మన కంటికి కపపడవు. సూర్యకాంతి మన కంటికి కనబడుతున్నట్లుగా తోస్తున్నది. కానీ ఎక్స్‌ రే కిరణాలు కనపడవు. అందువలననే మనిషి ద్వారా అవి ప్రసరింపబడి ఆ ఎక్స్‌ రే ఫిల్మ్‌ తయారౌతుంది.

అంటే, కంటికి కనపడనటువంటి సూక్ష్మతర, సూక్ష్మతమ... ఆల్ఫా, బీటా, గామా ఇలా చాలా కిరణాలు వున్నాయి. చాలా వలయాలు కూడా వున్నాయి. చాలా తరంగ దైర్ఘ్యాలు కూడా వున్నాయి. ఈ తరంగముల యొక్క, ఈ కిరణముల యొక్క పౌనఃపుణ్యము [frequency] వలన మనము ఎంతగా లోపలికి చొచ్చుకుపోతూ ఉంటామో అంతగా వ్యాపక ధర్మం కూడా వుంది.

కాబట్టి ఎలక్ట్రో మేగ్నటిక్‌ ఫీల్డు ని గనక మనం అంటే విద్యుదైస్కాంత తరంగ దైర్ఘ్యములను కనుక మనం ఫ్రీక్వెన్సీ ని గనక మనం డీ-కోడ్‌ చేసినట్లయితే, ఈ సృష్టి యందంతటా వ్యాపకమైనటువంటిది ఆ విద్యుదయస్కాంత తరంగములే. కాబట్టి, ఒక సత్యాన్ని తెలుసుకోవాలి.

ఎంతగా స్థూలమైతే, అంతగా పరిమితించబడిపోతున్నావు. ఎంతగా సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అవుతూ ఉంటావో అంతగా వ్యాపకత్వాన్ని కలిగివుంటావు.

“తనను అన్నిటి యందునూ, అన్నిటిని యందునూ తనను దర్శించగలగినటువంటి ధీరుడు ఎవడో వాడు ఆత్మ నిష్ఠుడు” మరియు ప్రాణుల బుద్ధి గుహయందు లేక హృదయాకాశమునందు ఇది వున్నది. ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిశోధన. మానవులందరూ కూడా బుద్ధి యొక్క గుహ ఎక్కడ ఉన్నదో అదే హృదయస్థానము. అట్టి హృదయము నందు మరల ఆకాశ స్థానము వున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/



09 Oct 2020

No comments:

Post a Comment