రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
59. అధ్యాయము - 14
🌻. సతీజన్మ - బాల్యము - 2 🌻
దక్షుడిట్లు పలికెను -
హే మహేశ్వరీ! జగన్మాతా! నీవు సనాతనివి. నీకు నమస్కారము. ఓ మహాదేవీ! దయను చూపుము. సత్యము నీవే. సత్యము నీ స్వరూపము (27). వేదవేత్తలు నిన్ను శివా, శాంతా, మహా మయా, యోగనిద్రా, జగత్స్వరూపిణీ అని వర్ణింతురు. హితములను చేగూర్చు నిన్ను నేను నమస్కరించుచున్నాను (28).
పూర్వము నీవు ధాతను సృష్టికార్యము నందు నియోగించగా, ఆయన సృష్టిని చేసెను. అట్టి నీకు నమస్కారము. నీవు విష్ణువును జగద్రక్షణ కార్యమునందు నియోగించగా,ఆతడు జగద్రక్షణను చేసెను. నీవు పరబ్రహ్మ స్వరూపిణివి. జగన్మాతవు. మహేశ్వరివి (30).
నీవు రుద్రుని జగన్నాశము కొరకు నియోగించగా, ఆయన అట్లు చేసెను. అట్టి నీకు నమస్కారము. పరబ్రహ్మ స్వరూపిణివి, జగన్మాతవు, మహేశ్వరివి నీవే (31). రజస్సత్త్వతమోగుణాత్మికవగు నీవు త్రిమూర్తుల రూపములో సర్వకార్యములను చేయుచున్నావు. నీవు జననివి. హేశివే! నీకు నేను నమస్కరించుచున్నాను (32). విద్య , అవిద్యలు నీ స్వరూపమే. పరాదేవివి అగు నిన్ను ధ్యానించువానికి ఇహలోకసౌఖ్యమే గాక, మోక్షము కూడ అరచేతి యందుడుంను (33). ఓ దేవీ! పావనివగు నిన్ను ప్రత్యక్షముగా దర్శించువానికి అవిద్యను ప్రకాశింపజేయు విద్య ఉదయించి ముక్తి లభించుట నిశ్చయము (34).
ఓ జగన్మాతా! నిన్ను ఎవరైతే భవానీ! అంబికా! జగన్మాతా! దుర్గా! అని స్తుతించెదరో వారికి సర్వము సిద్ధించును (35).
బ్రహ్మ ఇట్లు పలికెను -
బుద్ధి శాలియగు దక్షుడిట్లు స్తుతించగా, జగన్మాత యగు ఆ ఉమ తల్లికి వినబడని విధముగా దక్షునితో ఇట్లనెను (36). ఆచటనున్న ఇతరులందరూ మోహమును పొందిరి. ఆమె మాటలను దక్షుడు తక్క ఇతరులు వినలేకపోయిరి. ఆ పరమేశ్వరి లీలలు అసంఖ్యాకములు గదా!(37).
దేవి ఇట్లు పలికెను -
ఓ ప్రజాపతీ! నీవు పూర్వము నన్ను కుమార్తె కావాలని కోరి ఆరాధించితివి. నీకోరిక సిద్ధించినది. ఇపుడు నీవు నీ తపఃఫలమును అందుకొంటివి (39).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఆ దేవి అపుడు దక్షునితో నిట్లు పలికి, తన మాయచే మరల శిశుభావమును పొంది, తల్లి సమీపములో రోదించెను (40). అసిక్ని, మరియు ఇతర స్త్రీలు అందరు ఆ శిశువు యొక్క రూపమును చూచి ఆనందించిరి. పౌరజనులందరు కూడా అపుడు జయధ్వానములను చేసిరి (41). గానములు, వాద్యములతో గూడిన గొప్ప ఉత్సవము ప్రవర్తిల్లెను. ఆ కుమార్తె యొక్క మంగళ రూపమును చూచి దక్షుడు మరియు అసిక్ని ఆనందించిరి (42). అపుడు దక్షుడు యథావిధిగా వేదోక్త సంస్కారములతో బాటు కులాచారములను కూడా అనుష్ఠించెను. బ్రాహ్మణులకెందరికో ధనమును దానము చేసెను (43).
అంతటా సముచితమగు గాన నాట్యములతో, మంగల వాద్యములతో ఉత్సవము ప్రవర్తిల్లెను (44). అపుడు విష్ణువు మొదలుగా గల సర్వదేవతలు మహర్షి సంఘములతో కూడి వచ్చేసి యథావిధిగా ఉత్సవము నందు పాల్గొనిరి (45).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
24 Oct 2020
No comments:
Post a Comment