🍀 19. శరణాగతి సూత్రములు - ఆశను, మోహమును వదలి కర్మమును సమర్పణ బుద్ధితో నిర్వర్తించుట, శ్రద్ధ కలిగి అసూయ లేకుండుట, అనగా దైవమునకు సమర్పణము చేసుకొని తన బుద్ధికి తోచినది తాను చేయుటయే మోక్ష విధానం 🍀
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. కర్మయోగము - 31 📚
యే మే మత మిదం నిత్య మనుతిష్ఠంతి మానవాః |
శ్రద్ధావంతో 2 నసూయంతో ముచ్యంతే తే2 పి కర్మభిః || 31
శరణాగతి మార్గమును తెలిపిన భగవంతుడు మరిరెండు నియమములను కూడ సూచించుచున్నాడు. మొదటి నియమములు ఆశను, మోహమును వదలి కర్మమును సమర్పణ బుద్ధితో నిర్వర్తించుట. మరిరెండు నియమములు శ్రద్ధ కలిగి అసూయ లేకుండుటగ తెలిపినాడు. అనగా దైవమునకు సమర్పణము చేసుకొని తన బుద్ధికి తోచినది తాను చేయుటకు మొత్తము నాలుగు నియమము లీయబడినవి.
1. మోహము లేకుండుట.
2. ఆశ పడకుండుట.
3. అసూయ లేకుండుట.
4. శ్రద్ధ కలిగియుండుట.
పై నాలుగు నియమములు సర్వకర్మలయందు, సర్వ కాలములందు పాటించుట శరణాగతి కాగలదు. “నిత్యం అనుతిష్ఠంతి" అనుటలో ఎల్లప్పుడునూ అనుసరించ వలెనని హెచ్చరిక. అట్లు నిర్వర్తించు వానిని దైవమే నడుపును. తనను శరణుపొందిన వానిని తానే రక్షించునని, మోక్షము నిచ్చునని దైవము యొక్క వాగ్దానము. ఈ మార్గమునకు దైవమునందు పరిపూర్ణ విశ్వాసమే పునాది. అది అరుదు.
ప్రస్తుతకాలమున శరణాగతి తమ ఆశలను, కోరికలను తీర్చుకొనుటకే ఆస్తికులు చేయుచున్నారు. వీరి శ్రద్ధయును అంతంత మాత్రమే. అనసూయత్వము అసలే కరవు. మేము గురువునకు, దైవమునకు శరణాగతి చెందినాము అనుచుందురు. అట్టివారు పై నాలుగు నియమములు గమనించుచున్నారేమో పరిశీలించుకొనవలెను. (3-31)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
24 Oct 2020
No comments:
Post a Comment