🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 83 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -13 🌻
ఇక్కడ ఒక ఉపమానాన్ని చెబుతున్నారు. ఈ ఉపమానములో ఏమి చెపుతున్నారు? ‘కూపస్థ మండూకము’ ‘బావిలో కప్ప’. ఇది అందరికి తెలిసినదే. బావిలో కప్పగారున్నారట. సముద్రం అంటే ఇంతే అనుకుందట. ఎందుకని, అది ఎప్పుడూ కూడా, కప్ప ఆ బావినుంచి బయటకి రాలేదు కాబట్టి.
అది ఎప్పుడూ చెరువులు, నదులు, సముద్రము వంటి అపారమైనటువంటి నీటి వనరులను అనుభూతము చెందలేదు కాబట్టి, ఆ బావినే సముద్రముగా భావిస్తూవున్నది. బావి అంటే సముద్రమే. తెలిసిన వారికి మాత్రమే అది బావి. కానీ, ఆ కప్పగారికి మాత్రము అది సముద్రమే.
ఎందుకంటే దానికి బాహ్యపరిజ్ఞానము లేదు కాబట్టి. దాటినటువంటి, అధిగమించినటువంటి, శక్తి లేదు కాబట్టి. అందువల్ల, సృష్టి స్థితి లయములు అనేటటుంవంటివి మూడూ కూడా ఆత్మ లోపల జరగుతున్నాయి. ఆత్మయందు అనుభూతమౌతున్నాయి. ఆత్మయందు వ్యవహారముగా వ్యక్తమౌతున్నాయి.
కాబట్టి, ఆత్మ సృష్టి స్థితి లయములకు అవతల ఉన్నది. మరి అవతల ఉన్నటువంటి ఆత్మానుభూతిని పొందాలి అంటే మరి ఈ సృష్టి స్థితి లయములను దాటాలి కదా! అలా దాటకపోతే అది పొందలేరు కదా! అట్లా పొందాలి అంటే, తప్పక సాధన చతుష్టయ సంపత్తిని కలిగియుండాలి. అంతేకానీ, ప్రాకృత బుద్ధిని అంటే అజ్ఞానావృతమైన పరిమితమైనటువంటి బుద్ధిని కలిగినటువంటి వాళ్ళు ఈ సృష్టి స్థితి లయములను ఆత్మగా భావిస్తూ ఉంటారు.
ఎవరైతే అనంతమైనటువంటి సృష్టి, ప్రకృతి ధర్మంగా, ప్రకృతిలో భాగంగా, ప్రకృతిలో అంశీభూతముగా ఎలా అయితే అన్నీ సృష్టించబడుతున్నాయో, అన్నీ ప్రకృతిచేత పోషించబుడతున్నాయో, అన్నీ ప్రకృతిలో లయమైపోతున్నాయో ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతినే ఆత్మగా భావిస్తారు.
ఈ త్రిగుణాత్మకమైనటువంటిది ప్రకృతి కంటే అతీతమైనటువంటిది. ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతికి సాక్షి అయినటువంటిది. సాక్షి అయినటుంవంటి ఆత్మను తెలియజాలరు. ఈ ప్రకృతినే దైవంగా, ఈ ప్రకృతినే దివ్యత్వంగా, ఈ ప్రకృతినే ఆత్మ తత్త్వంగా, ప్రకృతినే సర్వాధారంగా భావించి, పరమాత్మను తెలియజాలరు.
ఈ సత్యాన్ని మనము గుర్తించాలి. కాబట్టి, ఆత్మానుభూతిని పొందాలి అన్నా, బ్రహ్మనిష్ఠను పొందాలి అన్నా, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి అన్నా, ప్రతీ ఒక్కరూ తప్పక త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని అధిగమించవలసినటువంటి అవసరము ఉన్నది. ఈ సత్యాన్ని పునః పునః పునః మనలో బలంగా నాటుకోవడానికి చెబుతున్నారు.
యమధర్మరాజు జీవాత్మ పరమాత్మల గురించి పరమాత్మను పొందు విధానము నచికేతునకు స్పష్టంగా వివరించుచున్నాడు.
నచికేతా! స్వయంకృతమగు కర్మఫలం ననుభవించు నిమిత్తము, జీవాత్మ పరమాత్మలు ఈ శరీరంలో శ్రేష్ఠమైనటువంటి బ్రహ్మకు స్థానముగా నున్నటువంటి బుద్ధి గుహయందు (హృదయాకాశము) ప్రవేశించుచున్నారు. ఈ విధంగా ప్రవేశించిన వీరిద్దరూ నీడ ఎండల వలె, పరస్పర విరుద్ధ లక్షణం కలవారుగా ఉన్నారని, బ్రహ్మవేత్తలు చెప్పుచున్నారు. అంతేగాక, పంచాగ్నుల నొనర్చువారున్ను, త్రిణాచికేతాగ్ని చయనము నొనర్చువారును, ఈ విధముగనే చెప్పుచున్నారు.
నచికేతా! స్వయంకృతమగు కర్మఫలము అనుభవించు నిమిత్తము, జీవాత్మ పరమాత్మలు ఈ శరీరంలో శ్రేష్ఠమైనటువంటి బ్రహ్మకు స్థానముగా నున్నటువంటి బుద్ధి గుహయందు ప్రవేశించుచున్నారు. ఇది చాలా ముఖ్యమైనటుంవంటిది. మానవ ఉపాధి ఎలా వచ్చింది? అనే ప్రశ్నకు సమాధానంగా చెబుతున్నారన్నమాట.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
24 Oct 2020
No comments:
Post a Comment