కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 104


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 104 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -34 🌻

ఈ గోళకములు ప్రత్యక్షానుభూతికి కారణమవుతున్నాయి, పనిముట్లవుతున్నాయి. అయితే, ప్రత్యక్షానుభూతి మాత్రమే సత్యమా అంటే, వాటి వెనుక ఉన్న ఇంద్రియం పనిచేయకపోయినట్లైతే నీకు ఆ ప్రత్యక్షానుభూతి కలగడం లేదు. ఊహించడం ద్వారా ఊహిస్తు ఉన్నావు. ఊహద్వారా తెలుసుకునేటటువంటి పరిజ్ఞానానికి, అనుభూతికి, పరోక్షానుభూతి అని పేరు.

ఆ పరోక్షానుభూతి, ఈ ప్రత్యక్షానుభూతి రెండూ కలిసి సరియైనటువంటి జ్ఞానంగా ఏర్పడింది. స్వస్వరూప జ్ఞానంగా ఏర్పడింది. అప్పడు అది అపరోక్షానుభూతి. ఈ రకముగా ఎవరైతే ఇంద్రియాలు, గోళకాలు వీటిని పనిముట్లుగా ఎవరైతే చూచారో, ఎవరైతే మెదడు కూడా ఒక పనిముట్టే, దానికి ఏమీ పెద్ద విశేషమేమీ లేదు. మెదడులో ఉండే నాడీ కేంద్రములు కూడా నీకు పనిముట్లే.

కాబట్టి, మీ మనసుకి ఇవన్నీ పనిముట్లు. ఒక్క మనసే కన్నౌతోంది, ఒక్క మనసే నోరౌతోంది, ఒక్క మనసే ముక్కౌతోంది, ఒక్క మనసే చెవౌతోంది, ఒక్క మనసే అన్ని ఇంద్రియాల రూపాలు ధరిస్తోంది. కాబట్టి, ఇంద్రియాలు ఎన్ని అంటే, ‘ఏకో ఇంద్రియః’ - ఒకటే ఇంద్రియం. అదేమిటి? మనసు.

కానీ, మనస్సు స్వయంగా పని చేస్తుందా? దాని కంటే సూక్ష్మ తరమైనటువంటిది ఏదైనా ఉందా? అని అడిగితే ఏం జరిగిందట? ఈ ఇంద్రియాలకు, ఆ మనసుకు మధ్యలో ఏమి ఉందట? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలతో కూడినటువంటి జ్ఞానం... శబ్దాది తన్మాత్రలు.

ఆ ఇంద్రియాలలో పనిచేస్తున్నటువంటి శబ్ద లక్షణము, స్పర్శ లక్షణము, రూప లక్షణము, రస లక్షణము. ఈ లక్షణాలు ఆ నాడీ కేంద్రాలలో ఇమిడి ఉంటాయి. అవి పని చేస్తూ, ప్రేరణ పొందుతూ, ప్రేరణ ఇస్తూ, అనుభూతి ఇస్తూ, సంవేదనలు ఇస్తూ ఉన్నాయి కాబట్టి, ఆ నాడీ కేంద్రాలు నీకు పని చేస్తున్నట్లుగా తోస్తున్నాయి.

దానికంటే సూక్ష్మమైనది మనస్సు. ఇప్పుడు ఆ శబ్దాది విషయజ్ఞానము పని చేసేటట్లుగా, విషయెన్ద్రియాలు పనిచేసేట్టుగా వుంచేటటువంటి వ్యవస్థ మనస్సు. ఆ మనస్సు కంటే సూక్ష్మమైనటువంటిది బుద్ధి. “నిర్ణయాత్మకో బుద్ధిః, వివేచనాత్మకో మనః” - ఏవైతే విచారణ చేయడానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయో పరిశీలన చేసి, ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను, మీ ముందు ఉంచగలిగేటటువంటి శక్తి మనసుకు ఉంది.

ఏమండీ! నేను అర్జెంటుగా తిరుమల తిరుపతికి దేవస్థానమునకు వెళ్ళి, వేంకటేశ్వరస్వామి దర్శనం చేయాలి అనుకున్నావు. రోజూ పొద్దున్నే వేంకటేశ్వర సుప్రభాతం వింటూ, వేంకటేశ్వరుని ఇలవేల్పుగా అర్చించేటటువంటి వారికి, నిజదేవతా దర్శనం విధిగా, ఆ వేంకటేశ్వరుని తిరుమల తిరుపతి దర్శించాలి అనే కాంక్ష కలిగింది.

కాంక్ష ఏ స్థానంలో కలిగింది ఇప్పుడు. కోరిక మనస్సులో కలిగింది. కలుగగానే మనస్సు ఏం చేసింది? ఎన్నిరకాలుగా నీవు ఆ కోరికను తీర్చుకోవడానికి గల అవకాశాలన్నిటినీ, నీ కళ్ళముందు ఉంచింది. నీ మనోఫలకం మీద ఉంచింది.

నీ మనోవీధిలో అటూ ఇటూ పరిగెడుతూ, ఆలోచనలన్నీ ఏర్పడ్డాయి. అలా వెళ్ళవచ్చు, ఇలా వెళ్ళవచ్చు, అలా క్యూ లో వెళ్ళవచ్చు, ఇలా క్యూ లో వెళ్ళవచ్చు, అన్ని గంటలు పడుతుంది, ఇన్ని గంటలు పడుతుంది, అంత సమయం పడుతుంది, ఇంత సమయం పడుతుంది, అంత కష్టం అవుతుంది, ఇంత కష్టం అవుతుంది, నడిచి వెళ్ళవచ్చు, ట్రెయిన్‌ లో వెళ్ళవచ్చు, బస్సులో వెళ్ళవచ్చు, ఎగిరి వెళ్ళవచ్చు, విమానంలో వెళ్ళవచ్చు, ఈ రకంగా ఇవన్నీ చెప్తుంది. కానీ, మనోనేత్రం ద్వారా ఆంతరిక దర్శనం ద్వారా నీ హృదయస్థానంలోనే నీవు వేంకటేశ్వర దర్శనాన్ని పొందవచ్చు అనేటటువంటి అంశాన్ని మాత్రం అది స్ఫురింపజేయదు.

ఎందుకని అంటే, దానికి ఎప్పుడూ బయటకు తిరిగి పనిచేయడం ప్రవృత్తి మార్గం మాత్రమే ఈ మనోఫలకం మీద పనిచేస్తుంది. వీరు నివృత్తి మార్గంలోకి రావాలంటే, మనసు కంటే సూక్ష్మమైనటువంటి బుద్ధి స్థితిలోకి రావాలి. అప్పుడేమయ్యారు? ఇవన్నీ ఎందుకు? సరియైనటువంటి ధ్యాన మగ్నత చెందినట్లయితే ఆ గాఢమైన ధ్యానస్థితిలో నా హృదయంలో నేను భగవంతుణ్ణి దర్శించగలుగుతాను.

అక్కడ వేంకటేశ్వరుడేంటి? “సర్వదేవతాం సుప్రష్ఠితం” - ఆ హృదయస్థానంలో ముప్ఫైమూడు కోట్ల మంది దేవతలున్నారు. నువ్వు ఎవ్వరిని ఆరాధిస్తే, ఆ ఆరాధనా ఫలం చేత, ఆ భక్తి విశ్వాసాల చేత, ఆ ధ్యాన బలం చేత, నీవు వారి దర్శనాన్ని అక్కడ పొందవచ్చు. స్వస్వరూప జ్ఞానం అనేటటువంటి ఆత్మసాక్షాత్కార జ్ఞానంలో ఈ బలం ఉన్నది.

కాబట్టి, ఎవరికి వారు వారి ఇష్ట దేవతా ఆరాధన చేసినప్పటికి, ఆయా ఇష్ట దేవతలు అందరూ కూడా ఆత్మయందు అంశీభూతములుగా ఉన్నారు. అటువంటి ప్రత్యగాత్మ యొక్క స్థితిని పొందాలి అనేటటువంటి లక్ష్యాన్ని మానవుడు స్వీకరించాలి. అప్పుడు ఏమైంది అంటే, ఉత్తమం తత్త్వ చింతాచ, మధ్యమం మంత్ర చింతాచ, అధమం శాస్త్ర చింతాచ, అధమాధమం తీర్ధాటనం.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


16 Nov 2020

No comments:

Post a Comment