శ్రీ శివ మహా పురాణము - 273


🌹 . శ్రీ శివ మహా పురాణము - 273 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

64. అధ్యాయము - 19

🌻. సతీకల్యాణము - శివలీల - 5 🌻

హే శంభో! మనము త్రిమూర్తలము నీ స్వరూపులము గాన వేర్వేరు గాదు. మన స్వరూపము ఒక్కటి. ఈ తత్త్వమును నీవు విచారించుము (64). మిక్కిలి ప్రియుడగు విష్ణువు యొక్క ఆ మాటను విని అపుడా శంభుడు ఆత్మ స్వరూపమును ప్రకటింప చేయదలచి మరల ఆతనితో నిట్లనెను (65).

శంభువు ఇట్లు పలికెను -

హే విష్ణో! నీవు భక్తులందరిలో శ్రేష్ఠుడవు. బ్రహ్మ నాకు ఆత్మ ఎట్లు అగును? ఈతడు నా కంటె భిన్నముగా ఎదురుగ నిలబడి ప్రత్యక్షముగ కనబడు చున్నాడు గదా! (66).

విష్ణువు ఇట్లు పలికెను -

ఓ సదాశివా! బ్రహ్మ నీకంటె వేరుగాదు. నీవు ఆతని కంటె వేరు గాదు. మరియు, నేను నీకంటె వేరు గాదు. ఓ పరమేశ్వరా! నీవు నాకంటె వేరు గాదు (68). హేసర్వజ్ఞా!పరమేశా!సదాశివా!నీకంతయూ తెలియును. నీవు నా నోటిగుండా అందరికీ సర్వమును వినిపించ గోరుచున్నావు (69).

ఈశా! నీ ఆజ్ఞచే శివతత్త్వమును నిలకడ అయిన మనస్సుతో చెప్పు చున్నాను. సర్వదేవతలు, మునులు, ఇతరులు వినెదరు గాక!(70). నీవు ప్రకృతి స్వరూపుడవు. ప్రకృతికి అతీతుడవు. లోకములో భిన్నముగా కనబడే సర్వము నీవే. కాని నీయందు భేదము లేదు. మనము త్రిమూర్తులము జ్యోతిర్మయుడగు శివుని అంశములైన దేవతలము (71).

నీవెవరు?నేనెవరు? బ్రహ్మ ఎవరు? పరమాత్మయగు నీ మూడు అంశములు సృష్టిస్థితిలయ నిర్వహణ కొరకై మూడు రూపములతో వేర్వేరుగా భాసించుచున్నవి (72).

నీ స్వరూపమును నీవే విచారణ చేయుము. నీవు నీ లీలచే దేహమును ధరించి యున్నావు. అద్వయ బ్రహ్మవు నీవే. సగుణ బ్రహ్మవు నీవే. మేము ముగ్గురము నీ అంశలమై యున్నాము. (73). ఒకే దేహమునందు శిరస్సు, మెడ ఇత్యాది అంగములు వేర్వేరుగా నున్నవి. హే హరా! అటులనే మేము ముగ్గురము శివుని మూడు అంగములుగా నున్నాము (74).

అగ్ని, మేఘము నీ నివాస స్థానములు. నీవు సనాతనుడవు. వికార రహితుడవు. అవ్యక్తుడవు. నీకు అనంతరూపములు గలవు. నీవు నిత్యుడవు. నీయందు దీర్ఘము మొదలగు విశేషణములు లేవు. నీవు శివుడవు. సర్వము నీ నుండియే ఉద్భవించినది (75).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! మహాదేవుడు అతని ఈ మటలను విని మిక్కిలి ప్రసన్నుడాయెను. మరియు ఆయన అపుడు నన్ను సంహరించలేదు (76).

శ్రీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండములో సతీవివాహ శివలీలా వర్ణనమనే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది (19).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


16 Nov 2020

No comments:

Post a Comment