గీతోపనిషత్తు - 76


🌹. గీతోపనిషత్తు - 76 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 14. నిష్కామకర్మ - ఫలాసక్తి లేక కర్మము నాచరించుట వలన అనాది కాలము నుండి కొందరు జీవులు మోక్షమున స్థిరపడి యున్నారు. నీవు కూడ “కర్మమునే చేయుము. ఫలముల నాశింపకుము” - కామము లేక కర్మము నిర్వర్తించుట అనునది ప్రారంభమున కష్టముగ గోచరించినను, ఆరంభించినచో క్రమముగ సుళువు దొరుకగలదు.🍀

📚. 4. జ్ఞానయోగము - 15 📚

జ్ఞాత్వా కృతం కర్మ పూర్వై రపి ముముక్షుభిః |

కరు కర్మైవ తస్మాత్వం పూర్వై: పూర్వతరం కృతమ్ || 15

ముముక్షత్వము పొందిన జీవులందరును పూర్వమాచరించిన సూత్రము “కర్మము నిర్వర్తించుట, కర్మఫలము నాశింప కుండుట." ఫలాసక్తి లేక కర్మము నాచరించుట వలన అనాది కాలము నుండి కొందరు జీవులు మోక్షమున స్థిరపడి యున్నారు.

కావున నీవు కూడ “కర్మమునే చేయుము. ఫలముల నాశింపకుము” అని తెలుపుటలో దైవము నిష్కామ కర్మ యోగము అనాది కాలము నుండియు గలదని, తానిపుడు క్రొత్తగ తెలుపుట లేదని తెలియ చెప్పుచున్నాడు.

నిజమునకు సద్గురువు తాను క్రొత్తగ నేదో చెప్పుచున్నట్లు భ్రమను కలిగింపడు. పూర్వీకులనుసరించి, తరించిన మార్గమునే మరల మరల వివరించును. అందుచేత మోక్షాసక్తి గల అర్జునునకు, అనాదిగా మోక్షస్థితి యందు స్థిరపడిన జీవు లేమిచేసిరో కూడ తెలిపినాడు.

నిజమునకు శ్రీకృష్ణు డాచరించినది, నిష్కామ కర్మమే. దాని నుపదేశించుటకు అతడే తగిన ఆచార్యుడు. కామము లేక కర్మము నిర్వర్తించుట అనునది ప్రారంభమున కష్టముగ గోచరించినను, ఆరంభించినచో క్రమముగ సుళువు దొరుకగలదు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


16 Nov 2020

No comments:

Post a Comment