భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 161


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 161 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. జాబాలిమహర్షి - 1 🌻.

జ్ఞానం:

1. మహానదుల, మహాఋషుల జన్మవృత్తాంతములు చిత్రంగా ఉంటాయి. వాళ్ళను, “మీరెవరు? ఎక్కడుంటారు? మీ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి? మీ పూర్వజన్మ వృత్తంతమేమిటి? మీ తల్లితండ్రులెవరు? మీ గురువెవరు?” అని అడిగితే, సరిఅయిన సమాధానాలు రాకపోవచ్చు. ఆ విషయాలు చెప్పటానికి అంత సులువుగా ఉండవు. క్లిష్టంగా ఉంటాయి.

2. జాబాల అనే విపస్త్రీకి దేవతావర ప్రసాదంగా సన్యాత్వదశ యందు ఈ జాబాలి పుట్టాడని ఒక పురాణం చెపుతున్నది.

3. ఒక అనుభవానికి, ఆధ్యాత్మిక అనుభవానికి ప్రధానంగా ఉండవల్సిన స్థితి ఏమిటంటే, ముక్తికొరకై నిరీక్షణ. అవి ఎప్పుడూ ఉండవలసిందే! తపస్సు చేసే సమయంలో అనుభూతం కావలసిన ఆత్మజ్ఞానానుభూతి కొరకు నిష్క్రియుడై, నిరంజనుడై, నిర్మలచిత్తుడై ఏ ఉద్రేకమూలేక, ప్రకృతివలె తటస్థుడై ఉండాలి. దాని కొరకై ఇంద్రియములతోను, మనసుతోను చేసే ప్రయత్నము ఏదీ ఉండరాదు.

4. కేవలం జపం గట్టిగా చేయగలగటం కాని, ధ్యానం పట్టుదలతో చేయటం గాని తపస్సు కానేరదు. కళ్ళుగట్టిగా ప్రయత్నపూర్వకంగా మూసుకుని, అంతరాత్మలో ఏదో ఉంది, దాన్ని చూద్దామనుకునే కోరిక గాని – అదంతా క్రియాశీలత్వము, రజోగుణము యొక్క స్వభావమే. అంతేగాని అది తపోస్వరూపంకాదు.

5. స్వయంప్రకాశమయినది ఆత్మ. దానికి అడ్డువాచేది మన అవిద్యేకాని, దానిలో ఇవాళ కొత్తగా ఏ ప్రకాశమూ రావలసిన ఆవశ్యకత లేదు.

6. ఈ సంసారంమీద భయం, దీనియందు విరాగము, విరక్తి, తక్షణమైనటువంటి మోక్షాపేక్ష, సంసారభీతి – ఇవన్నీ లభించిన తరువాత సాధన, తపస్సు, అనుభవము అంటే ఏమిటంటే; నిష్క్రియత్వమే, అంటే ఏమీ చేయకుండా ఉండటమే. అలా ఉండటమే సాధన చేయటమని అర్థం గాని, ఏదో చేయటం అనేది సాధనకాదు.

7. తీవ్రంగా కష్టపడుతున్నాడా అంటే ఏమీలేదు. నిష్క్రియుడని అర్థం. తీవ్రత అంటే ఏమిటి? ఎవరు పిలిచినా పలుకలేదు. రాళ్ళతో కొట్టినా లేవలేదు. మీద మట్టిపోస్తే ఏమీ అనలేదు. కోపగించలేదు. కొడితేకూడా దెబ్బలుతింటూ అలాగే ఉంటాడు. దేని ధ్యాస యందున్నాడో ఎవరికీ తెలియదు. దానినే నిష్క్రియత్వం అనవచ్చు. రమణ మహర్షికూడా అంతే.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


16 Nov 2020

No comments:

Post a Comment