✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 84 🌻
తత్ త్వం - అనేటటువంటి పద్ధతిగా త్వం - తాను ఎలా ఉన్నాడు? తాను ఏ స్థితిలో ఉన్నాడు? తాను ఏ నిర్ణయంతో ఉన్నాడు? తాను ఏ లక్షణంతో ఉన్నాడు.
తాను ఏమి సాధించాలి? ఆ సాధించ వలసినటువంటి లక్ష్యాన్ని సంబంధించిన లక్షణాలు ఏమిటి? ఆ లక్షణాలను తాను పొందటం ఎలా? దీనికి అడ్డంగా వున్నటువంటివి ఏమిటి? అంటే ప్రవృత్తి, నివృత్తి. వాసనా నివృత్తి. నిర్వాసనా స్థితి. మరి వాసనాక్షయం అంటారు. మరి ఆ రకమైనటువంటి వృత్తులన్నీ, దశవిధ ప్రళయాలున్నాయి. ఈ ఎనిమిది శరీరాలలోనూ దశవిధ ప్రళయాలు జరుగుతూ ఉన్నాయి.
వృత్తి ప్రళయము, నిత్యప్రళయము, శరీర ప్రళయము, బ్రహ్మప్రళయము, విష్ణు ప్రళయము, రుద్ర ప్రళయము, మహేశ్వర ప్రళయము, సదా శివ ప్రళయము, విరాట్ పురుష ప్రళయము. ఈ రకంగా ఆ దశవిధ ప్రళయాలు జరుగుతూ వున్నాయి. అవి పుడుతూ ఉన్నాయి.
కొంతకాలము ఉంటూ ఉన్నాయి. మరల కొంతకాలము తరువాత లేకుండా పోతున్నాయి. ఈ రకంగా మరి పది జరగుతున్నాయి కదా! ఆయా వ్యవహార స్థితులలో మరి వాటయందు పుడుతూ వున్నాడు, పోషించబడుతున్నాడు మరలా లయించబడుతున్నాడు. కాబట్టి, జీవుడనేవాడు నిత్యప్రళయాన్ని అనుభవిస్తున్నాడు.
జాగ్రదావస్థలో ఉన్నట్లుగా తోస్తున్నాడు. స్వప్నావస్థలో ఉన్నట్లుగా తోస్తున్నాడు. సుషుప్తి అవస్థలో అడ్రస్ లేకుండా పోయినట్లు తోస్తున్నాడు. మరలా జాగ్రదావస్థకి తిరిగి వచ్చేసరికి, నేను ఉన్నాడంటున్నాడు. మరి ఏ నేను ఉంటున్నాడు? అన్న ప్రశ్నని వేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది.
ఈ రకంగా శరీర తాదాత్మ్యత చేత, వ్యవహార తాదాత్మ్యత చేత, వ్యావసాయిక తాదాత్మ్యత చేత, వృత్తి తాదాత్మ్యత చేత, ఈ తాదాత్మ్యత అనుబంధము చేత, సంగత్వ దోషము చేత, త్రిగుణాత్మకమైనటువంటి, ప్రకృతి మాలిన్యం యొక్క దోషం ఒప్పుకొనటం చేత, ఇన్ని రకాలైనటువంటి అంశాలని, తానే అనుకోవటం చేత, అఖండముగా ఉన్నటువంటి, తన స్వరూపమునందు ఘటము, మఠము, పటము... అనేటటువంటి భేదములు తోస్తున్నాయి. కారణమేమిటి? స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహాదులు తోస్తున్నాయి.
దాని అర్థం ఏమిటి? ఉన్న ఆకాశం ఒక్కటే, కానీ.. ఓ కుండ వచ్చింది. ఆ కుండలో ఆకాశం మరల వేరే అనేటటువంటి భ్రాంతి కలిగింది. చిన్న కుండ, పెద్ద కుండ, ఇంకా పెద్దకుండ, ఇంకా పెద్ద కుండ.... ఘటం సైజు మారింది అంతే! ఘటం సైజు పెరిగినంత మాత్రాన ఆకాశంలో భేదమొచ్చిందా? అనే సత్యాన్ని మనం గుర్తించాలి.
అంటే, ఉదాహరణ చెబుతాను... ఇప్పుడే పుట్టిన పిల్లవాడున్నాడు. 90 ఏళ్ళ వృద్ధుడున్నాడు. ఇప్పుడే పుట్టిన పిల్లవాడిలోనూ, అవే సప్త ధాతువులే ఉన్నాయి. 90 ఏళ్ళ వృద్ధుడిలోనూ అవే సప్త ధాతువులే ఉన్నాయి. స్థూలంగా ఏ మార్పులేదు. పోనీ సూక్ష్మంగా ఉందందామా? అవే మనో బుద్ది ప్రాణములు.
ఆ ప్రాణ మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జన్మించిన శిశువులో, 90 ఏళ్ళ వృద్ధుడిలో కూడా ఆ ప్రాణమనోబుద్ధులే ఉన్నాయి. మరి ఇంకా పోనీ కారణ స్థితిలో తేడా ఉందందామా? ఇప్పుడు పుట్టిన పిల్లవాడు నిద్రావస్థలో ఎలా ఉన్నాడో, 90 ఏళ్ళ వృద్ధుడు కూడా నిద్ర అవస్థలో అలానే ఉన్నాడు.
మరి ఏమిటి మారింది అంటే, జ్ఞానాజ్ఞానముల యొక్క పరిణామము మారుచున్నది. ఇంకా ఏమీ మారటం లేదు. ఇప్పుడే పుట్టిన పిల్లవాడు, 90 ఏళ్ళ వృద్ధుడు ఒక్కటే అని తీర్మానం చేశామనుకో, అప్పుడేమయ్యింది? కుండను పెట్టి తీర్మానం చేసినట్లయ్యింది.
ఈ కుండలో ఉన్న ఆకాశం, ఆ కుండలో ఉన్న ఆకాశం... అంతా ఒక్కటే కదా! కాబట్టి, ఈ కుండ, ఆ కుండ ఒక్కటే. 90 ఏళ్ళ వృద్ధుడు, ఇప్పుడే పుట్టిన పిల్లవాడు ఒక్కటే అని చెప్పవచ్చునా? అంటే, ఆత్మ దృష్ట్యా ఒక్కటే! కానీ, అనాత్మ దృష్ట్యా అనేకంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు శరీర అభాస కలుగుతోంది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
06 Jan 2021
No comments:
Post a Comment