శ్రీ శివ మహా పురాణము - 316
🌹 . శ్రీ శివ మహా పురాణము - 316 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
79. అధ్యాయము - 34
🌻. దుశ్శకునములు - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
వీరభద్రుడు ఈ తీరున గణములతో గూడి పయనించుచుండగా, అచట దక్షునకు మరియు దేవతలకు చెడు శకునములు కానవచ్చునవి (1). ఓ దేవర్షీ! వీరభద్రుడు గణములతో గూడి ముందునకు కదలుచుండగా యజ్ఞవినాశమును సూచించే, మూడు విధముల (ఆధ్యాత్మిక, ఆధి భౌతిక, ఆధిదైవిక) ఉత్పాతములు అనేక భంగుల కానవచ్చినవి (2).
దక్షుని ఎడమ కన్ను, చేయి, తొడ అదరినవి. వత్సా! ఇది అశుభమును సూచించే శకునము. ఈ శకునము కలిగినచో, అనేక కష్టములు కలుగును (3). దక్షుని యజ్ఞము జరిగే ఆ స్థలములో ఆ సమయమునందు భూమి కంపించెను. మరియు మధ్యాహ్నము నక్షత్రములు కనబడుట అనే అద్భుతమును దక్షుడు చూచెను (4).
దిక్కులన్నియూ ధూళితో మలినములయ్యెను. సూర్యుడు వివిధములగు రంగులలో కన్పట్టెను. సూర్యుని చుట్టూ, అసంఖ్యాకములగు మండలములు ఏర్పడి భీతిని గొల్పెను (5). మెరుపు వలె మండుచున్న నక్షత్రములు నేల గూలెను. ఆ సమయములో నక్షత్రములు క్రిందివైపునకు వంకర టింకర మార్గములో పయనించెను (6). వేలాది గద్దలు దక్షుని శిరస్సును స్పృశించెను. గద్దల రెక్కల నీడలతో యాగమండపము కప్పివేయబడెను. (7). యాగ స్థలమునందు నక్కలు ఊలలు పెట్టెను. అడవి పందులు వికృత ధ్వనులు చేసెను. అచట ఉల్కలు వర్షించెను. తెల్లని తేళ్లు పుట్టెను (8).
భయంకరములగు గాలులు ధూళిని వర్షించుచూ వీచెను. సుడిగాలులచే సర్వము కంపించెను. మిడతలు పుట్టుకువచ్చెను. (9). తీవ్రమైన గాలులు దక్షయజ్ఞ మండపమును పైకి లేవగొట్టెను. అద్భుతమైన ఆ నూతన మండపమును దక్షుడు దేవతలతో కలిసి నిర్మించెను (10).
ఆ సమయములో దక్షుడు మొదలగు వారందరు రక్తమును, మాంసపు ముక్కలను, ఎముకలను అనేక పర్యాయములు వమనము చేసిరి. ఆ దృశ్యము బీభత్సముగ నుండెను (11). వారు గాలిలోని దీపమువలె వణుక జొచ్చిరి. పదునైన శస్త్రములచే కొట్టబడిన వారువలె, వారందరు దుఃఖింపజొచ్చిరి (12).
అపుడు వారు బిగ్గరగా రోదించుట చే కన్నీరు ప్రవాహమే, వారి కన్నులు వనమధ్యములో సరస్సుయందు మంచు బిందువులను వర్షించు పద్మములవలె నుండెను (13). దక్షుడు మొదలగు వారి నేత్రములు అంతవరకు స్వచ్ఛముగనే యున్ననూ అకస్మాత్తుగా, రాత్రియందు పద్మములవలె, పగలు కలువల వలె శోభను గోల్పోయినవి (14).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
06 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment