భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 221


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 221 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. జైమినిమహర్షి - 6 🌻


31. ‘అదానదోషాత్ భవేద్దరిద్రః‘, అంటే దానం చేయకపోవటం వలననే దరిద్రుడవుతాడు. మామూలుగా ఈ శ్లోకాన్ని అందరం చదువుతాము. దానం చేయకపోవటంచేత మనుష్యుడు దరిద్రుడవుతున్నాడు. ‘పునరేవ దరిద్రః పునరేవ పాపీ‘. దానం చేయకపోతే దరిద్రుడు అవుతాడు. దారిద్య్రంవలన మళ్ళీ పాపంచేస్తాడు. ఇలా ఉన్నారు మనుష్యులు. అందుకే, ఉన్నవాడు దానం చేసుకోవాలి. దారిద్య్రంలో ఉన్నప్పుడు ఏం దానం చేయగలరు? అందువల్ల దానంచెయ్యాలనిచెప్పి హితబోధలు, హితవాక్యాలు మనకు చాలా ఉన్నాయి.

32. షడర్శనములలో జైమిని ‘పూర్వమీమాంస’ ఉంది. అందులో ప్రభాకర, భాట్టములనే రెండుమతాలున్నాయి. వాటిలో ఒకరికి అయిదు ప్రమాణాలు, మరొకరికి ఆరు ప్రమాణాలు ఉన్నాయి. “మిరందరూ అనుకుంటున్నటువంటి సర్వజ్ఞుడనేవాడు, మహోత్తమ లక్షణాలు కలిగినవాడు, జగత్తుకు ప్రభువైనవాడు – విభుడు, నిత్యుడు, చిదాత్మకుడు మొదలైన లక్షణాలు అన్నీ కలిగిఉన్నాదంటున్న ఈశ్వరుడనే వాడు ఎవరూలేరు” అన్నాడు జైమిని. అలా అనగానే మనకు దుఃఖం కలుగుతుంది.

33. మన విశ్వాసానికి అది మూలఛ్ఛేదం అవుతుంది. ఈయన లేడని అంటే, ఉన్నాడని ప్రమాణాలు ఎంతోమంది చెప్పారు. అయితే ఈశ్వరుడు ఉన్నాడని సమర్థించేవాళ్ళు ప్రత్యక్షంగా ప్రమాణానికి దొరకరు. పోనీ ఉన్నాడని చూపించడానికి వీలుకలుగదు. అనుమానప్రమాణంతో కూడా ఆయన నిర్ధారణ చేయటానికి వీలులేదు.

34. ఇకపోతే ఆగమము, ఉపమానము, ఉపమేయములతో ఇలా ఉంటాడని. చెప్పటానికి మాత్రమే బాగుంటుంది. అంటే, ఎప్పుడూకూడా మనంచూడని వస్తువునుకూడా ఉందని నమ్మించవచ్చు. ఉదాహరణకు, ఒక ఊళ్ళో ఒక పెద్ద పక్షి ఉంది. ఇది ఇలా ఉంటుందని ఒకరు చెప్పవచ్చు. అంటే దాని పోలికలు ఇలా ఉంటాయని చెపితే, ఉంటే ఉండవచ్చు.

35. కాని అలాంటి పోలిక ఏమీ చెప్పదానికి వీలులేని వస్తువు ఈశ్వరుడు. దేనితోనూ పోల్చడానికి వీలులేని వస్తువు అది. అట్లాంటి వస్తువుకు ఉపమానం ఏం ఉంది? ఉపమేయంకాదది. ఈశ్వరుడు! కాబట్టి ‘ఉపమానము లేనిదానిని ఎందుకు విశ్వసించాలి?’ అని జైమిని ఒక ప్రశ్నవేశాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


29 Jan 2021

No comments:

Post a Comment