శ్రీ శివ మహా పురాణము - 336
🌹 . శ్రీ శివ మహా పురాణము - 336 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
85. అధ్యాయము - 40
🌻. శివదర్శనము -1 🌻
నారదుడిట్లు పలికెను -
హే విధీ! నీవు శివతత్త్వమును ప్రదర్శించే మహాప్రాజ్ఞుడవు. మిక్కిలి మనోరంజకము, మహాద్భుతమునగు శివలీలను వినిపించితివి (1). వీరుడగు వీరభద్రుడు దక్షయజ్ఞమును ధ్వంసము చేసి, కైలాస పర్వతమునకు వెళ్లినాడు గదా !ఓ తండ్రీ! తరవాత ఏమైనదో ఇప్పుడు చెప్పుము (2).
బ్రహ్మ ఇట్లు పలికెను -
అపుడు సర్వదేవగణములు, మరియు మనులు పరాజితులై, రుద్రుని సేనలతే చితకకొట్టబడిన అవయవములు గలవారై నా లోకమునకు వచ్చిరి (3). స్వయంభువుడనగు నాకు సమస్కరించి పరిపరి విధముల స్తుతించి తమకు కలిగిన ఆపత్తును సమగ్రముగా నివేదించిరి (4). పుత్ర శోకముచే పీడితుడనై మిక్కిలి ఆదుర్దాతో దుఃఖముతో నిండిన మనస్సు గల నేను వారి మాటలను విని ఆలోచించితిని (5). ఇపుడు దేవతలకు సుఖము కలుగుటకై నేను చేయదగిన కర్తవ్యమేమి ? దక్షుడు మరల బ్రతికి ఈ యజ్ఞము పూర్తియగు ఉపాయమేది ? (6).
ఓ మహర్షీ! ఇట్లు నేను పరిపరి విధముల ఆలోచించితిని. కాని నాకు మనశ్శాంతి లభించలేదు. అపుడు భక్తితో విష్ణువును స్మరించగా, ఆ సమయమునకు తగిన జ్ఞానము కలిగినది (7). అపుడు దేవతలతో మరియు మునులతో గూడి నేను విష్ణులోకమునకు వెళ్లి నమస్కరించి వివిధ స్తోత్రములతో స్తుతించి మా దుఃఖమును విన్నవించితిని (8). హే దేవా! ఈ యజ్ఞము పూర్ణమై ఆ యజమాని, సర్వ దేవతలు మరియు మునులు సుఖమును పొందు ఉపాయమును చేయుము (9). దేవదేవా! లక్ష్మీ పతీ! విష్ణో! నీవు దేవతలకు సుఖమునిచ్చువాడవు. దేవతలతో మునులతో గూడిమేము నిన్ను నిశ్చయముగా శరణు పొందియున్నాము (10). బ్రహ్మనగు నా ఈ మాటను విని శివస్వరూపుడగు ఆ లక్ష్మీపతి దైన్యముతో గూడిన మనస్సు గలవాడై శివుని స్మరించి ఇట్లు బదులిడెను (11).
విష్ణువు ఇట్లు పలికెను -
ఉన్నతిని గోరువారు తేజశ్శాలియగు వ్యక్తి విషయములో అపరాధమును చేయుట తగదు. అట్లు అపరాధమును చేయువారికి క్షేమము కలుగదు. వారి కోరిక నెరవేరదు (12). దేవతలందరు పరమేశ్వరుడగు శివుని యందు అపరాధమును చేసిరి. ఓ విధీ !వీరు శంభునకు యజ్ఞ భాగమునీయకుండిరి (13). మీరందరు గొప్ప ప్రసాద బుద్ధిగల ఆ శివుని కాళ్లను పట్టుకొని శుద్ధమగు మనస్సుతో ప్రసన్నుని చేయుడు (14).
ఆ దేవుడు కోపించినచో సమస్త జగత్తు నశించును. ఆయన శాసించినచో లోకపాలకుల జీవితము వెంటనే సమాప్తమగును. యజ్ఞము ధ్వస్తమగును (15).మిక్కిలి దుష్టుడగు దక్షునిచే తప్పు మాటలను పలికి ఆయన హృదయము గాయపరుచబడినది. ప్రియురాలి తోడు లేని ఆ దేవుని వెంటనే క్షమార్పణను కోరుడు (16). ఓ బ్రహ్మా శంభుడు శాంతించి సంతసించుటకు ఇదియే ఏకైకమగు గొప్ప ఉపాయమని నేను తలంచెదను. నేను సత్యమునే పలుకుచున్నాను (17).
నేను గాని, నీవు గాని, ఇతర దేవతలు గాని, మునులు గాని, ఇతర ప్రాణులుగాని ఆయన తత్త్వమును, ఆయన బల పరాక్రమముల సీమలను ఎరుంగజాలగు (18). స్వతంత్రుడు, పరుడు, పరమాత్మయగు ఆ శివునకు విరోధియగు పరమ మూర్ఖునకు ఉపాయమును ఎవరు చెప్పనిచ్చగించెదరు ? (91).
ఓ బ్రహ్మా !నేను కూడ మీ అందరితో గూడి శివుని ధామమునకు వచ్చెదను. నేను కూడ శివుని యందు నిశ్చితముగా అపరాధమును చేసితిని. ఇపుడు క్షమార్పణను చెప్పెదను (20).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
29 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment