గీతోపనిషత్తు -161


🌹. గీతోపనిషత్తు -161 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 8

🍀 8 - 3. యోగ కారకములు - 2. కూటస్థ : చంచలత్వము, మార్పు లేక ఏకరీతిలో ఉన్న ప్రజ్ఞ, నిశ్చలత్వము, నిర్వికారత్వము కలిగి యుండుట కూటస్థ స్థితి. జ్ఞానము విజ్ఞానముగ పరిణతి చెందినపుడు మాత్రమే యోగసాధకుడు కూటస్థుడు కాగలడు. క్షేత్రము నుండి యోగసాధకుని ప్రజ్ఞ అక్షరత్వము చెందుచుండును. అట్టి వానిని కూటస్థుడందురు. జ్ఞానము విజ్ఞానముగ పరిణతి చెందినపుడు మాత్రమే యోగసాధకుడు కూటస్థుడు కాగలడు. అట్టివాడే ఇంద్రియములను జయించిన వాడగును. 🍀


2. కూటస్థ :

చంచలత్వము, మార్పు లేక ఏకరీతిలో ఉన్న ప్రజ్ఞ, నిశ్చలత్వము, నిర్వికారత్వము కలిగి యుండుట కూటస్థ స్థితి. క్షరపురుషుడు గాలికి రెపరెపలాడుచు ఆరిపోవు దీపము వలె నుండును. అక్షర పురుషుడు నిశ్చల జ్యోతివలె నుండును. యోగ సాధకుడు అట్టి స్థితిని పొందవలెనని ఈ శ్లోకము సూచించు చున్నది.

జ్ఞానము, విజ్ఞానముగ పరిణతి చెందుచున్నపుడు యోగ సాధకునకు నిత్యానిత్య వస్తు వివేకము కలుగు చుండును. జీవితమున జరుగు సన్నివేశము లన్నియు వచ్చిపోవు విషయములని తెలియు చుండును.

మమకారము, మోహము వంటి బంధములు తరుగుచుండును. భయము, శోకము తగ్గుచుండును. క్రమముగ అరిషడ్వర్గములు విసర్జింపబడును. తత్ఫలితముగ బాహ్య సన్నివేశములు అతని మనస్సును కలవర పెట్టవు. మనసు చంచల స్థితి నుండి అచంచల స్థితికి చేరును. క్షేత్రము నుండి యోగసాధకుని ప్రజ్ఞ అక్షరత్వము చెందుచుండును. అట్టి వానిని కూటస్థుడందురు.

ఎన్ని సమ్మెట దెబ్బలు తగిలినను కంసాలి యొక్క దాగిలి చెక్కు చెదరక యుండును. పదును కలిగి యుండును. దానికి చలన ముండదు. కంసాలి దాగిలిని కూట మందురు. కూటస్థుడనగ అట్టి నిశ్చలత్వము కలవాడని అర్థము. పర్వత శిఖరములను కూడ కూటము లందురు. శిఖరము ఎండకు, వానకు, గాలికి, చలికి, వేడిమికి తట్టుకొనుచు ఉత్తమ స్థితి యందుండును. కూటస్టు డట్టివాడు. కూటస్థితి అక్షర స్థితి. అది ఉత్తమ స్థితి. అట్టి స్థితప్రజ్ఞత్వము అరుదుగ నుండును.

జ్ఞానము విజ్ఞానముగ పరిణతి చెందినపుడు మాత్రమే యోగసాధకుడు కూటస్థుడు కాగలడు. అట్టివాడే ఇంద్రియములను జయించిన వాడగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


01 Mar 2021

No comments:

Post a Comment