శ్రీ శివ మహా పురాణము - 361


🌹 . శ్రీ శివ మహా పురాణము - 361 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

94. అధ్యాయము - 06

🌻. పార్వతి పుట్టుట - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-


అపుడా దంపతులు దేవ కార్యమునందు శ్రద్ధ గలవారై జగన్మాతను కుమార్తెగా పొందగోరి ఆమెను భక్తితో నిత్యము స్మరించుచుండిరి (1). పూర్వము తండ్రివలన అవమానమును పొంది యోగాగ్నిచే శరీరమును త్యజించిన ఆ చండిక అపుడు మరల హిమవంతుని భార్యయొక్క గర్భమునందు జన్మించుటకు సంకల్పించెను (2).

ప్రసన్నురాలై కోర్కెలనన్నింటినీ ఈడేర్చు ఆ తల్లి తాను ఇచ్చిన మాటను సత్యము చేయదలచెను. అపుడా మహేశ్వరి పూర్ణాంశముతో హిమవంతుని మనస్సులో ప్రవేశించెను (3). విశాల హృదయుడు అగు ఆ హిమవంతుడు అపుడు మిక్కిలి ఆనందము గలవాడై, అపూర్వ కాంతులతో విరాజిల్లెను. ఆయన అగ్నిహోత్రము వలె తేరిపార చూడరాని తేజస్సుతో విరాజిల్లెను (4).

అపుడు హిమవంతుడు మంగళకరమగు సమయములో శివాదేవి యొక్క పూర్ణాంశమును పరిశుద్ధమగు చిత్తముతో తన ప్రియురాలియందు ఆధానము చేసెను (5). మేన తన మనస్సునందుండి కరుణను వర్షించే పరమేశ్వరి అనుగ్రహము వలన గర్భమును దాల్చెను. హిమవంతుని పత్ని గర్భవతి కాగా ఆ పర్వత రాజు మిక్కిలి సుఖమును పొందెను (6).

హిమవంతుని ప్రియురాలగు మేన, సర్వ బ్రహ్మాండములకు నివాస స్థానమగు జగన్మాతను తన గర్భములో ధరించుటచే, సర్వదా తేజోరాశిచే వ్యాప్తయై అతిశయించిన ప్రకాశముతో ఒప్పారెను (7). మేన యొక్క గర్భిణీ లక్షణములు ఆమె భర్తకు ఆనందమును కలిగించెను. మరియు దేవతల శుభకరమగు కోరిక ఈడేరుటచే, వారికి ఆమె గర్భము ఆనందహేతువు ఆయెను (8).

శరీరములో శక్తి తక్కువగా నుండుటచే తక్కువ ఆభరణులను ధరించి, లోధ్ర పుష్పమువలె పాండు వర్ణము గల ముఖముతో ప్రకాశించే ఆమె చంద్రుడు అస్తమించిన తరువాత కనబడీ కనబడని నక్షత్రములు గల రాత్రివలె భాసిల్లెను (9). ఓ మహర్షీ! పర్వతరాజగు హిమవంతుడు ఏకాంతమునందు మృద్గంధముతో గూడియున్న ముఖమును ముద్దాడి అతిశయించిన ప్రేమను ప్రదర్శించెను. అయిననూ, ఆయనకు తృప్తి కలుగలేదు (10).

మేన ఏయే వస్తువులను కోరుచున్నది ? ఆమె సిగ్గు వలన నాకు చెప్పకున్నది ఆమె అభీష్టమేమి? అని హిమవంతుడు ఆమె చెలికత్తెలను పదే పదే ప్రశ్నించెను (11). గర్భసంబంధి క్లేశమును పొందిన మేన దేనిని చూచినా, లేక కోరినా దానిని హిమవంతుడు వెనువెంటనే రప్పించి ఆమెకు ఇచ్చెడివాడు. ఆమెకు ఇష్టమై ముల్లోకములలో ఆయన సంపాందిప శక్యము కాని వస్తువు లేనే లేదు (12).

వృద్ధి పొందిన అవయవములు గల ఆ మేన గర్భక్లేశమును అతిక్రమించి, అనేక పత్రములతో నిండుగా నున్న లేత తీగవలె ప్రకాశించెను (13). హిమవంతుడు గర్భవతియగు తన భార్యను, నిధులనన్నిటినీ తనలో దాచుకున్న పృథివిని వలె, అగ్నిని తన గర్భములో దాచుకున్న శమీ వృక్షమును వలె, భావన చేసెను (14).

వివేకి యగు హిమవంతుడు ప్రియురాలి మనస్సును సంతోషపెట్టుటకు, తాను సంపాందించిన ధనమును సద్వినియోగము చెయుటకు, వేదధర్మము యొక్క ఉన్నతి కొరకు వైదిక సంస్కారములనన్నిటినీ యథావిధిగా జరిపించెను (15). కొంత కాలము తరువాత హిమవంతుడు, వైద్యులచే రక్షింపబడుతూ పురిటి గృహములో నున్న మేనను చూచెను. ఆమె ప్రసవించుటకు సిద్ధముగా నుండి, మేఘములతో నిండి వర్షించుటకు సిద్ధముగా నున్న అంతరిక్షమువలె, ప్రకాశించెను (16).

తన గర్భమునందు జగన్మాతను ధరించి మహా తేజస్సుతో నొప్పారు, శుభకరములగు అవయవములు గల ప్రియురాలిని చూచి, ఆ సమయములో హిమవంతుడు మిక్కిలి ఆనందించెను (17). ఓ మహర్షీ! ఆ సమయములో విష్ణువు మొదలగు దేవతలు, మరియు మునులు అచటకు వచ్చి గర్భమునందున్న ఉమా దేవిని స్తుతించిరి (18).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


01 Mar 2021

No comments:

Post a Comment