భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 243


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 243 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 7 🌻


48. ఎవరికి భవంతునిమీద పగ ఉంటుందో, వాడికి ఆయన కనపడడు, వాడిని పట్టించుకోడు. వాడెంత అపచారం చేసినా సహిస్తాడు, మాట్లాడడు. కాని, వాడిని కటాక్షించడు. ఎందుచేతనంటే, వాడికి తన ఉనికి తెలియటంకూడా ఆయన సహించడు.

49. కాబట్టి వాళ్ళ యందు పూర్తిగా భగవంతుడికి ఉపేక్ష ఉంటుంది. శత్రువులయందు శ్రద్ధ ఉండదు, భక్తుడియందే శ్రద్ధ ఉంటుంది. అలాకాకపోతే, శత్రువుమీద ఆయనకు కోపమే ఉండి ఉంటే, అది శ్రద్ధ అవుతుంది కదా!.

50. ఆసేతుశీతాచల పర్యంతం రామేశ్వరం నుంచీ కేదార్‌నాథ్ వరకు ఆ సంప్రదాయాలు, ఆ పూజలు, ఆ మంత్రాలు, ఆ విగ్రహాలు అవన్నీ ఏదో విచిత్రంగా ఉంటాయితప్ప తత్త్వం మాత్రం ఒక్కటే!

51. భారతీయతలో ఆ గురుతత్త్వం, ఆ ప్రబోధం, ఆ మార్గం, ఆ శరణాగతి అదంతాకూడా అలాగే ఉంటుంది. ఈ భారతీయ సంప్రదాయంలో ఈ మహర్షులు ప్రతిష్ఠించింది ఏమిటంటే, అది ఈశ్వరతత్త్వంకంటే, గురుతత్త్వం అనే చెప్పాలి. వాళ్ళు దానిని సుప్రతిష్ఠంచేసి దానికి శాశ్వతం ఇచ్చి వెళ్ళిపోయారు.

52. నిజంగా గురుతత్త్వమే అయిన ఈ ఋషుల చరిత్రలన్నీకూడా అమోఘమైనటు వంటివి. వీటిలో ప్రతీచోట బ్రహ్మవిష్ణు రుద్రులొస్తున్నారు. అంటే త్రిమూర్తులతీనే సన్నిహితసంబంధం కలిగిఉన్నప్పటికీ, వీరు మనుష్యులే! వాళ్ళు ఎంతోమందిని ఉద్ధరించారు. ఈ గురుతత్త్వం మాత్రం ఎప్పుడైనా ఈ భారతదేశంలో నశించదు.

53. ఈ సంప్రదాయం ఎప్పుడయినా, ఎప్పటికైనా భారతదేశ సంస్కృతికి కల్యాణప్రదమై పునరుజ్జీవన హేతువవుతుంది. ఈ సంస్కృతియొక్క పునరుజ్జీవనహేతువు దేంట్లో ఉండంటే, ఈ గురుతత్త్వంలోనే.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




01 Mar 2021

No comments:

Post a Comment