శ్రీ శివ మహా పురాణము - 510


🌹 . శ్రీ శివ మహా పురాణము - 510 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 43

🌻. శివుని అద్భుత లీల - 2 🌻


ఇంతలో మణిగ్రీవుడు మొదలగు యక్షులు కానవచ్చిరి. వారిసేన గంధర్వుల సేన కంటె రెట్టింపు శోభతో ఆమెకు కానవచ్చెను (13). వారి ప్రభువైన మణి గ్రీవుని ప్రకాశమును చూచి ఆమె 'శివస్వామి ఈయనయే' అని మిక్కిలి ఆనందముతో పలికెను (14). 'ఈయన శివస్వామి కాదు. ఈతడు శివుని సేవకుడు' అని నీవు హిమవంతుని భార్యతో చెప్పితివి. ఇంతలో అగ్ని ముందుకు వచ్చెను (15). మణి కంఠుని కంటె కూడ రెట్టింపు శోభ గల ఆతనిని చూచి 'పార్వతీ పతి యగు రుద్రడీతడే' అని ఆమె పలికెను. అపుడు నీవు కాదని చెప్పితివి (16).

ఇంతలో అంతకంటె రెట్టింపు శోభ గల యముడు వచ్చెను. వానిని చూచి ఆ మేన ఆనందముతో 'ఈతడే రుద్రుడు' అని పలికెను (17). కాదని నీవు చెప్పితివి. ఇంతలో అంతకు రెట్టింపు శోభ గలవాడు, పుణ్యాత్ములకు ప్రభువు, శుభకారకుడు అగు నిర్‌ఋతి వచ్చెను (18). ఆయనను చూచి ఈతడే రుద్రుడని మేన ఆనందముతో పలికెను. కాదని నీవామెతో చెప్పితివి. ఇంతలో వరుణుడు వచ్చెను (19). నిర్‌ఋతికంటెనూ రెట్టింపు శోభగల ఆతనిని చూచి ఆమె 'పార్వతీ పతియగు రుద్రుడు ఈతడే' అని పలికెను. అపుడు కాదని నీవు చెప్పితివి (20).

ఇంతలో వరుణుని కంటె రెట్టింపు శోభ గల వాయువు వచ్చెను. వానిని చూచి ఆ మేన ఆనందముతో 'ఈతడే రుద్రుడు' అని పలికెను (21). కాదని నీవామెతో చెప్పితివి. ఇంతలో వాయువు కంటె రెట్టింపు శోభ గలవాడు, యక్షులకు ప్రభువు అగు కుబేరుడు వచ్చెను (22). ఆతనిని చూచి ఆ మేన హర్షముతో ఈతడే రుద్రుడని పలికెను. కాదని నీవామెతో చెప్పితివి. ఇంతలో ఈశానుడు విచ్చేసెను (23). ఆతని యొక్క శోభ కుబేరుని శోభ కుబేరుని శోభకు రెట్టింపు ఉండుట ను గాంచి, ఆమె 'పార్వతీ పతి యగు రుద్రుడీతడే' అని పలికెను. అపుడు కాదని నీవు చెప్పితివి (24).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


26 Jan 2022

No comments:

Post a Comment