కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 𝟤𝟪

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 28 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 16 🌻

ఈ అవిద్యారూపములకు ఉపమానం చెప్తున్నాడు. స్త్రీ పుత్ర ధనాదులు. ఏమండీ, ఇక్కడ వింటున్న వాళ్ళందరిలో స్త్రీలే ఎక్కువమంది వున్నారు.

మీరు స్త్రీలని బహిరంగంగా చెప్తున్నారు. మరి ఏ స్త్రీలు అని అడగవచ్చు మీరు. ఇందాకే చెప్పాను. స్త్రీలంటే ప్రకృతీ స్వభావం కలిగినటువంటి, జీవస్వభావం కలిగినటువంటి వారందరూ, శరీరమే నేనుగా జీవించేవారందరూ స్త్రీలే. పుత్ర అంటే మీ వారసులు.

పుత్రికల గురించి ఎందుకు చెప్పలేదండీ అనుకోవనక్కర్లా. పున్నామనరకం ఎవరికైతే కలుగుతుందో, ఆ పునః నామ నరకం పొందడానికి, జనన మరణ చక్రంలో భ్రమించడానికి, తిరగడానికి సిద్ధపడ్డవారందరూ కూడా మోహమును కలిగివున్నవారే. అందరూ మోక్షమునకు దూరమైనవారే. మోక్షం అంటే మోహక్షయం. విద్యారూపమగు శ్రేయోమార్గము చేత మోహము క్షయించిపోతుంది.

ఆత్మజ్ఞానవిశేషంచేత జరిగేటటువంటి ఒకే ఒక పని ఏమిటంటే మోహము క్షయిస్తుంది. ఇది దాని యొక్క ప్రయోజనం.

ఆత్మవిశేషంచేత, ఆత్మానుభూతి వలన భౌతికమైనటువంటి ప్రయోజనాలు సిద్ధించవు. మా అమ్మాయికి ఆరోగ్యం బాగుపడాలి. అవదు. మా అబ్బాయికి ఉద్యోగం రావాలి. అదీ అవదు. మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి. అదీ అవదు. మరి ఏమిటి దీనివల్ల ప్రయోజనం? నీలోపల ఆంతరిక పరిణామాన్ని పొందుతావు. నీకు దేనియందైతే, జగత్తుయందున్నటువంటి వస్తు, మానవ, జీవ సంబంధాలు ఏవైతే వున్నాయో వాటన్నింటి యెడల మోహము క్షయించిపోయేట్లు చేస్తుంది. అదొక్కటే ఈ ఆత్మవిచారణ వలన ప్రయోజనం.

విద్య - ఆత్మజ్ఞానం వల్ల ప్రయోజనం, శ్రేయోమార్గము వల్ల ప్రయోజనం; ఏక ప్రయోజనం. ఏమిటంటే సత్య శాంత సమరస భావముచేత మోహక్షయం కలుగుతుంది. మోహము క్షయించి పోవడం ద్వారా నీవు ఉత్తమగతిని పొందుతావు. ఏమిటా ఉత్తమగతి అంటే? జననమరణ చక్రంలో పడకుండా వుంటావు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment