గీతోపనిషత్తు -141


🌹. గీతోపనిషత్తు -141 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 26

🍀 24. ఆత్మ నెరిగిన వారు - బ్రహ్మ నిర్వాణమును పొందినవారు విదితాత్మలై వర్తింతురు. వారు యత చేతస్సులు. యతులు. కామక్రోధముల నుండి విడి వడినవారు. బ్రహ్మ నిర్వాణమనగ బ్రహ్మమునందు కరగిన అహంకార స్థితి. అహంకారమునకు మూలమైన తత్త్వమే బ్రహ్మతత్వము. అది త్రిగుణములకు లోబడినపుడు ప్రత్యేగాత్మయై తానొకడ నున్నాడని భావన చెందును. తత్వమే తానుగ నున్నాడని తెలియుట, తత్వము నుపాసించుట, తాను కరిగి తత్త్వము మిగులుట జరిగినచో అది బ్రహ్మ నిర్వాణ మగును. బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందినవారి బుద్ధి నుండి, మనసు నుండి, యింద్రియముల నుండి, వాక్కు నుండి, చేతల నుండి బ్రహ్మ తత్త్వమే ప్రకాశించును. అట్టివారిని యతులు అందురు. యతీంద్రు లందరు. 🍀

కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్ ।
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్ ।। 26 ।।

బ్రహ్మ నిర్వాణమును పొందినవారు విదితాత్మలై వర్తింతురు. వారు యత చేతస్సులు. యతులు. కామక్రోధముల నుండి విడి వడినవారు. బ్రహ్మ నిర్వాణమనగ బ్రహ్మమునందు కరగిన అహంకార స్థితి. మంచుగడ్డ నీటియందు తేలుచున్నపుడు అది వేరుగ గోచరించును. నీటికన్న విలక్షణమైన లక్షణములు కలిగి యుండును. ఎవరి ముఖమున నైనను నీరు చల్లినచో చల్లగ యుండును గాని, బాధింపదు.

మంచుగడ్డతో కొట్టినచో బాధ కలుగును. అహంకార స్థితి మంచుగడ్డవంటి స్థితి. నీటి స్థితి బ్రహ్మము లేక ఆత్మ స్థితి. అహంకారమునకు మూలమైన తత్త్వమే బ్రహ్మతత్వము. అది త్రిగుణములకు లోబడినపుడు ప్రత్యేగాత్మయై తానొకడ నున్నాడని భావన చెందును.

నిజమునకు తన రూపమున నున్నది పరతత్వమే. బ్రహ్మతత్వమే. ఆ తత్త్వమే తానుగ నున్నాడు. తత్వమే తానుగ నున్నాడని తెలియుట, తత్వము నుపాసించుట, తాను కరిగి తత్త్వము మిగులుట జరిగినచో అది బ్రహ్మ నిర్వాణ మగును. బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందినవారి బుద్ధి నుండి, మనసు నుండి, యింద్రియముల నుండి, వాక్కు నుండి, చేతల నుండి బ్రహ్మ తత్త్వమే ప్రకాశించును.

అనగ బ్రహ్మమే అన్ని పొరల నుండి విదితమగు చుండును. వారి మాట, చేత, నడవడికల నుండి బ్రహ్మమే ప్రకాశించు చుండును. ఇట్టి వారిని విదితాత్ము లందురు.

విదితాత్ము లనగ ఆత్మ నెరిగిన వారని అర్థము. ఆత్మ తత్త్వమే సర్వత్ర విదితము గావించువారని మరియొక అర్థము. ఇట్టివారి వర్తనమున చూపరులకు ఆత్మ తత్త్వము విదితమగు చుండును. ఇదియంతయు 17వ శ్లోకమున చెప్పబడిన రీతిగ, బ్రహ్మ పరాయణులై యుండుట వలన ఏర్పడు స్థితి.

ఎవరి బుద్ధి, మనసు, యింద్రియములు, వాక్కు, చేష్టల నుండి ఆత్మ తత్త్వము విదిత మగుచుండునో అట్టివాని చేతన యమింపబడి యుండును. అనగా చైతన్య స్వరూపిణియగు శ్రీమాత తన మాయను ప్రసరింపజేయక, అనుకూలవతియై

యుండును. చేతన తత్వమునకు అనుకూలముగ నుండుటవలన సర్వము యమింపబడినవారై యుందురు. అట్టివారిని యతులు అందురు. యతీంద్రు లందరు.

నిరంతరము తత్వమునే ప్రకాశింప జేయుదురు. అట్టివారిని కామ క్రోధములు దరిచేరలేవు. స్పృశించ నైన స్పృశించలేవు. వారు కామక్రోధ వియుక్తులు అని తెలుపుట అతిశయోక్తి కానేరదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


05 Feb 2021

No comments:

Post a Comment