శ్రీ శివ మహా పురాణము - 342

🌹 . శ్రీ శివ మహా పురాణము - 342 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

86. అధ్యాయము - 41

🌻. దేవతలు శివుని స్తుతించుట -3 🌻


శ్రేష్ఠమగు వాటన్నింటి కంటె శ్రేష్ఠుడు, తనకంటె పరము లేనివాడు, సర్వవ్యాపి, వశ్వమూర్తి, పరమేశ్వరుడు అగు నీకు నమస్కారము (39). విష్ణువు యొక్క అంశ పత్నిగా గలవాడు, విష్ణువు క్షేత్రముగా గల క్షేత్రజ్ఞుడు, సూర్య రూపుడు, భైరవుడు, శరణాగతి చేయదగినవాడు, లీలావిహారి అగు ముక్కంటి దేవునకు నమస్కారము (40).

శోక స్వరూపుడు, సత్త్వరజస్తమో గుణస్వరూపుడు, చంద్ర సూర్యాగ్నులు కన్నులుగా గలవాడు, సర్వమునకు కారణమగు ధర్మము తన రూపముగా గలవాడు అగు మృత్యుంజయునకు నమస్కారము (41). నీవు నీ తేజస్సుచే జగత్తునంతనూ వ్యాపించి యున్నావు. నీవు వికారములు లేని, చిదానంద స్వరూపమగు, ప్రకాశస్వరూపమగు పరబ్రహ్మవు (42).

ఓ మహేశ్వరా ! బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, చంద్రుడు మొదలుగా గల దేవతలు, మునులు, ఇతరులు నీనుండి పుట్టినారు (43). నీవు శరీరమును ఎనిమిది భాగములుగా విభజించి సర్వజగత్తును ధరించియున్న అష్టమూర్తివి. ఈశ్వరుడవు. నీవు ఆద్యుడవు. కరుణామూర్తివి (44).

నీభయముచే ఈ గాలి వీచుచున్నది. నీ భయముచే అగ్ని దహించుచున్నది. నీ భయముచే సూర్యుడు తపించుచున్నాడు. మృత్యువు అంతటా పరువులెత్తుచున్నది (45). ఓ దయాసముద్రా! మహేశ్వరా !పరమేశ్వరా! ప్రసన్నుడవు కమ్ము. ముర్ఖులైన భ్రష్టులైన మమ్ములను సదా రక్షింపుము (46).

హే నాథా! కరుణానిధీ! నీవు మమ్ములను ఎల్లవేళలా ఆపదలన్నింటి నుండియూ రక్షించినావు. హే శంభో! ఈనాడు కూడా అదే తీరున మమ్ములను పూర్తిగా రక్షించుము (47). హే నాథా! నీవు శీఘ్రమే మమ్ములను అనుగ్రహించి సమాప్తము కాని యజ్ఞమును ఉద్ధిరించుము. హే దుర్గేశా! దక్షప్రజాపతిని కూడ అనుగ్రహించుము (48).

భగునకు నేత్రములను లభించుగాక! యజమానుడగు దక్షుడు జీవుంచుగాక! పూషకు దంతములు మొలకెత్తుగాక! భృగువునకు పూర్వము వలెనే గెడ్డము, మీసములు వచ్చుగాక! (49) ఓ శంకరా! నీ ఆయుధములచే, రాళ్ళచే విరుగగొట్టబడిన ఆ వయవములు గల దేవతలు మొదలగు వారందరికీ నీ అనుగ్రహముచే ఆరోగ్యము అన్ని విధములా సమకూరుగాక !(50).

హే నాథా! మిగిలిన యజ్ఞ కర్మలో నీకు పూర్ణభాగము లభించుగాక! రుద్రునకు భాగము గల యజ్ఞమే పరిపూర్ణము అగును. అట్లు కాని యజ్ఞము ఎన్నటికీ పరిపూర్ణము కాదు (51). ఇట్లు పలికి ఆ బ్రహ్మ, విష్ణువు చేతులొగ్గి భూమిపై దండమువలె పడి నమస్కరించి క్షమార్పణలను చెప్పుకొనిరి (52).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్రసంహితయందు రెండవదియగు సతీ ఖండములో దేవస్తుతి వర్ణనమనే నలభై ఒకటవ అధ్యాయము ముగిసినది (41).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


05 Feb 2021

No comments:

Post a Comment