భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 226


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 226 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. మైత్రేయమహర్షి - 3 🌻


14. కర్మస్వరూపమేది? కర్మఫలస్వరూపమేది? అనేవి ముఖ్యప్రశ్నలు. మామూలుగా నిష్కాముడివై కర్మచెయ్యమని అంటాం. కాని కామ్యకర్మ అని అంటున్నాం అలా ఎందుకు అంటున్నామంటే, ‘నా ఇంట్లో ఉన్న భార్యాబిడ్డలకు, నాకు ధనం కోసమని అడగటంలేదు’ కాబట్టి, దానిని నిష్కామకర్మ అంటున్నాం.

15. కానీ నిజంగా కామ్యకర్మ కాకపోవటమేమిటి కరమ? జ్ఞానకర్మా అది? మోక్షంకోసమని చేస్తున్నామా! జ్ఞానం అర్థిస్తున్నామా! లోకక్షేమంకోసం చేసేదికూడా కామ్యకర్మే. ఏదయినా కామ్యకర్మే అవుతోంది!

16. వ్యక్తిగతమయిన స్వార్థం లేకపోవటం మాత్రం చేత నిష్కామకర్మ కాదది. అందుచేత లోకక్షేమంకోసం చేసేటటువంటి కర్మ(కృష్ణుడు చేసినటువంటి కర్మ)కూడా కర్మే కదా! కామ్యకర్మే అవుతొందికదా! మరి దాని ఫలమతడు ఎందుకు అనుభవించడు? ఏమయిందా కర్మ? అని ప్రశ్న.

17. కృష్ణపరమాత్మను ఆదర్శంగా తీసుకుని ఎవరయితే అతడి తత్త్వాన్ని గ్రహించి కర్మచేస్తాడో, అంటే అతడిని ఆదర్శంగా తీసుకుని ఆయననే భావనలో పెట్టుకుని చేసేటట్లయితే; అది అతడికి ఫలరహితం, అది లోకానికి ఫలప్రదం అవుతుంది.

18. లోకక్షేమం కోసమని కూడా, ఇతరులు-సామాన్యులు-చేసేకర్మ వాళ్ళను బంధిస్తుంది. కానీ లోకక్షేమంకోసం చేసే కర్మ-లోకానికి మాత్రమే ఫలాన్నిచ్చి, కర్తకు ఫలం ఇవ్వకుండా ఉండాలంటే; కృష్ణతత్త్వంలోనే ఆ రహస్యం ఉంది. ఆ సత్యమే మైత్రేయమహర్షికి ఆయన బోధచేసాడు.

19. తనలో ఉన్న నేవెవరు? “నేను అంతస్సాక్షిగా ఉండే, పరమాత్మ స్వరూపుడైనటువంటి విశ్వుడను ‘నేను’. ఈ దేహిని కాను. ఈ దేహంలో ఉండే, ఈ గోత్రనామములు కలిగిన మనుష్యుడుచేసే కర్మ ఉన్నదే, దీని(ఈ కామ్యకర్మయొక్క) ఫలమేదైతే ఉందో, అది లోకానికే సంక్రమించాలి.

20. ఇక్కడ కర్తలేడు సుమా! ఈ నశ్వరమైన దేహంలో, నశించిపోయే నామరూపాలు కలిగిన ఈ మనుష్యుడు చేసేకర్మ, నశ్వరమైనటువంటి దేహికి చెందకూడదు. నేను నిత్యుణ్ణి కాబట్టి అది నాకంటదు. ఈ కర్మ ఫలంలోకానికే ముడుతుంది” అని సంకల్పంచెయ్యాలి. అదే కృష్ణుడి ఉద్దేశ్యం.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


05 Feb 2021

No comments:

Post a Comment