🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. దేవలమహర్షి - 2 🌻
7. తపస్సు, జ్ఞానము, యోగము కలిగినవాళ్ళు మోక్షార్హులవుతారు. కాని తపస్సు ఒక్కటే ఉన్నవాడుకాని, జ్ఞానం ఒక్కటే ఉన్నవాడుకాని, యోగం ఒక్కటే ఉన్నవాడుకాని మోక్షార్హుడు కాడు.
8. స్తోత్రంచేసినా, నిందించినా అందులో ఎలాంటి అప్రియత్వమూ మనసులో లేకపోవత్ము, కొట్టినా శరీరానికి నొప్పితో అమ్మో అనకపోవటము (అంటే తనను గురించిన విచారణలేనివాడు, విచారించనివాడు) ఇవన్నీ ధన్య గుణములు, సుగుణములు. అవే మోక్షానికి కావలసినవి. మోక్షదర్సనం ఎవరైతే కోరతారో అతడికి విధిగా ఉండతీరవలసిన లక్షణములివి.
9. శీలసంపద అతి ముఖ్యమైనటువంటిది. అతి పదిలంగా దాచుకోవలసినది శీలము. తన శీలాన్ని పోగొట్టుకోవడం అనేది జరగకూడదు. శీలము అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారములలో ఎవరికీ ఎలాంటిహానీ తలపెట్టక, దేనియందుకూడా ఆశపెట్టుకోక, బయటిప్రపంచంతో సంబంధం లేనటువంటి శాంతిని తాను పొందటము.
10. ఇంద్రియ నిగ్రహంవలన ఎలాంటి చాపల్యమూ మనసులో, స్వప్నంలోకూడా కలగకుండా ఉండవలసిన శీలం అనేటటువంటి పరమ పవిత్రమైన వస్తువు ఒకటి వృద్ధిపొందుతుంది. దానికి భంగం కలిగితే తపస్సుకు భంగం కలిగినట్లే. దానికి భంగంకలిగితే తపస్సు నాశనమవుతుంది, పుణ్యం నశిస్తుంది, పతనము కలుగుతుంది.
11. ఎంతవాడికైనా, తాను రక్షించుకోవలసిన వస్తువు శీలమొక్కటే. ఎందుకంటే ఏ లక్షణంచేత మునులు తపస్సు ఫలించి ఉత్తమఫలాన్నిపొందారో గుర్తుపెట్టుకోవాలి. తపస్సు ఫలిస్తుంది. తపస్సుచేస్తే ఫలం ఎట్లా వచ్చింది? శీలరక్షణకొరకై వచ్చింది.
12. శీలరక్షణకొరకై, ఏ పరవస్తువునూ తాను కన్నెత్తి చూడకూడదు. దేనినీ ఆశించకూడదు. ఎన్నడూ ఎవరినీ దూషించకూడదు. పరమ సాత్వికమైన వృత్తిలో ఉండాలి. అహంకారంతో ఇంకొకడు అల్పుడిగా కనబడితే, అతడు యథార్థంగా అల్పుడే అయినప్పటికీ కూడా, అతనిని మనసావాచాకర్మణా అవమానించకపోవటమే ఉత్తమ లక్షణము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
12 Feb 2021
No comments:
Post a Comment