రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
88. అధ్యాయము - 43
🌻. దక్షయజ్ఞ పరిసమాప్తి -2 🌻
బ్రహ్మయందు భక్తి లేనిదే, విష్ణువునందు భక్తి లేనే లేదు. విష్ణుభక్తి లేకుండా నా యందు భక్తి ఎక్కడైననూ పుట్టదు (19). ఇట్లు అందరు వినుచుండగా పలికి దయానిధి, పరమేశ్వరుడు అగు శంకర స్వామి మరల ఇట్లనెను (20). నన్ను నిందించు విష్ణు భక్తుడు, విష్ణువును నిందించు శివభక్తుడు కూడా సాపమును పొందెదరు. వారికి జ్ఞానము కలుగదు (21).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! మహేశ్వరుని ఈ సుఖకరములగు వచనములను విని అక్కడనున్న దేవతలు, మునులు మొదలగు వారందరు సంతసించిరి (22). కుటుంబ సమేతుడైన దక్షుడు మహా ప్రీతితో శివభక్తశ్రేష్ఠుడై సర్వదా శివుని సేవించెను. దేవతలు మొదలగు వారందరు అఖిలేశ్వరుడు శివుడేనని తలపోసిరి (23). అచట ఎవరెవరు ఏ విధముగా పరమాత్మయగు శంభుని స్తుతించిరో, వారివారికి సంతోషించిన మనస్సుగల శంభుడు ఆయా వరముల నిచ్చెను (24). ఓ మహర్షీ! శివభక్తుడు, ప్రసన్నమగు బుద్ధిగలవాడు అగు దక్షుడు శివునిచే ఆజ్ఞాపింపబడినవాడై శివానుగ్రహముతో యజ్ఞమును పూర్తి చేసెను (25).
అతడు దేవతలకు వారివారి యజ్ఞ భాగములను, శివునకు పూర్ణభాగమును ఇచ్చెను. బ్రాహ్మణులకు దానములను చేసెను. అతడీ తీరున శంభుని అనుగ్రహమును పొందెను (26). ఇట్లు దక్షప్రజాపతి శివదేవుని అనుగ్రహముచే ఆ మహాయజ్ఞమును ఋత్విక్కుల సహకరాముతో యథావిధిగా పూర్తిచేసెను (27). ఓ మహర్షీ! పరబ్రహ్మ స్వరూపుడగు శంకరుని అనుగ్రహముచే అచట దక్షుని యజ్ఞము ఈ విధముగా సంపూర్ణ మాయెను (28). అపుడు దేవతలు, ఋషులు అందరు శంకరుని కీర్తిని గానము చేయుచూ, తమ తమ ధామములకు చేరుకొనిరి. అపుడు ఇతరులు అందరూ కూడ శుఖశాంతులను పొందిరి (29).
నేను మరియు విష్ణువు మంగళములనన్నిటినీ ఇచ్చే శంభుని కీర్తిని నిరంతరముగా గానము చేయుచూ ఆనందముతో మా ధామములకు చేరుకుంటిమి (30). సత్పురుషులకు శరణ్యుడగు మహాదేవుడు కూడా దక్షునిచే సన్మానింపబడినవాడై, ఆనందించి, ప్రీతితో తన గణములను వెంటబెట్టుకొని తన ధామము అగు కైలాస పర్వతమునకు వెళ్లెను (31). శంభుడు తన పర్వతమునకు చేరుకొని తన ప్రియురాలగు సతీదేవిని స్మరించెను. ఆయన ప్రధానులగు గణాధ్యక్షులతో ఆమె వృత్తాంతమును విస్తారముగా వర్ణించుచూ చాల కాలమును గడిపెను (32). ఆ ప్రభుడు జ్ఞానియే అయిననూ, లోకపు పోకడననుసరించి విరహవ్యథను ప్రకటిస్తూ, ఆమె గాథలను వర్ణిస్తూ చిరకాలము గడిపెను (33).
ఓ మహర్షీ! పరబ్రహ్మ సత్పురుషులకు శరణ్యుడు అగు శివస్వామి నీతి లేని దనమును సహించడు. ఆయనకు మోహము గాని, శోకముగాని, వికారముగాని కలిగే ప్రసక్తియే లేదు (34). ఆయన .యొక్క సగుణ నిర్గుణ రూపములకు గల భేదమును నేను గాని, విష్ణువుగాని ఏనాడైననూ తెలియ లేకపోతిమి. మునులు, దేవతలు, యోగులు, మానవులు మొదలగు వారి గురించి చెప్పునదేమున్నది? (35)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
12 Feb 2021
No comments:
Post a Comment