భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం : పెళ్లి కావట్లేదా..? Sri Veereswara Swamy Temple (Accompanied by Goddess Bhadrakali): Is your marriage getting delayed?



🌹 భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం : పెళ్లి కావట్లేదా..? కోనసీమలో ఉన్న ఈ ఆలయంలో కళ్యాణం చేయించండి. 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Sri Veereswara Swamy Temple (Accompanied by Goddess Bhadrakali): Is your marriage getting delayed? Perform the wedding ceremony at this temple located in Konaseema. 🌹

Prasad Bharadwaj




ఈ కాలంలో పెళ్లిళ్లు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. పెళ్లిళ్లు ఆలస్యంగా జరగటానికి అనేక కారణాలు ఉన్నాయి. త్వరగా పెళ్లి అవడానికి యువతీ యువకులు, వారి తల్లితండ్రులు ఆలయాలకు తిరుగుతూ ఉంటారు.

అయితే ఈ గుళ్లో కళ్యాణం చేయిస్తే త్వరగా పెళ్లి అవుతుందని చాలా మందికి తెలియదు. అదే కోనసీమ జిల్లాలోని మురమళ్ళ గ్రామంలోని భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం.

🛕 భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయ చరిత్ర.. 🛕

దక్షయజ్ఞాన్ని శివుడి నాశనం చేయడానికి వీరభద్ర స్వామిని సృష్టించాడు. అది అయ్యాక ఎంతకీ వీరభద్రుడికి కోపం తగ్గకపోవడంతో విష్ణు మూర్తిని దేవతలు వేడుకుంటారు. విష్ణుమూర్తి వల్ల కూడా వీరభద్రుడ్ని శాతపరచడం కాకపోవడంతో దేవతలు ఆదిపరాశక్తిని వేడుకున్నారు. దాంతో ఆమె వీరభద్రస్వామిని శాంతింపజేయడానికి భద్రకాళి అనే తన కళలలో ఒకదానిని భూలోకానికి పంపింది. సమీపంలోని ఒక నీటి కొలను నుండి యువతి రూపంలో ప్రత్యక్షమైంది. ఆమెను చూసిన తర్వాత వీరభద్రస్వామి శాంతించాడు. దీంతో వారిద్దరికీ గాంధర్వ వివాహ పద్ధతిలో వివాహం చేసారు. మహా మునులందరూ ముని మండలి అని పిలువబడే ఆశ్రమాలను నిర్మించారు. ఆ స్థలమే తరువాత మురమళ్ళగా ప్రసిద్ధి చెందింది. అప్పటి నుంచి మహా మునులందరూ వీరభద్ర స్వామికి గంధర్వ వివాహ పద్ధతిలోనే నిత్య కళ్యాణ ఘట్టాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది నేటికీ కొనసాగుతోంది.

ఈ ఆలయం గోదావరి నదీ తీరాన్నే ఉంటుంది. గతంలో భారీ వరదలకు నదీ ప్రవాహానికి ఆలయం కూలిపోయింది. కొమరగిరికి చెందిన శరభ రాజు కలలో శ్రీ వీరభద్ర స్వామి కనిపించి ఆలయాన్ని పునరుద్ధరించమని ఆదేశించడంతో ఆయన శివలింగాన్ని నది నుండి బయటకు తీసి తరలిస్తుండగా మురముల్ల గ్రామంలోనే ఆ శివలింగం బరువు పెరిగిపోవడంతో అక్కడే కొత్త ఆలయాన్ని స్థాపించారు.


🍀 ఆలయ ప్రత్యేకత.. 🍀

వీరభద్రుని కల్యాణంతో ఇక్కడ నిత్యకల్యాణం జరుగుతుంది. దీంతో తల్లితండ్రులు తమ పిల్లల పెళ్లిళ్లు ఆలస్యం అయితే ఇక్కడ మురమళ్ళ గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి – భద్రకాళి మాతకు వివాహాలు జరిపిస్తారు. స్వామి వారికి కళ్యాణం చేయడం వల్ల ఆటంకాలు తొలగిపోయి, త్వరగా వివాహాలు జరుగుతాయి. అలా చాలామందికి జరిగాయని అక్కడికి వచ్చే భక్తులు చెప్తారు.


💐 ఇక్కడ నిత్యకళ్యాణం జరుగు విధానము.. 💐

స్వామి వారికి సాయంత్రం మూడు ప్రదక్షిణలతో ధూపసేవ చేసి శ్రీ భద్రకాళీసమేత వీరేశ్వర స్వామి వారిని నందివాహనముపై లేదా పల్లకిలో గ్రామోత్సవం నిర్వహించి ఆలయంలో ఉన్నమంటపము నందు మృదంగం, శృతి, తాళ వాయిద్యాలతో అర్చకస్వాములు యక్షగానము చేస్తూ పండితులు వేద మంత్రములచే స్వామి వారిని తీసుకొస్తారు. కళ్యాణంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, కంకణధారణ యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, సుముహూర్తం, సూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమము జరిపించి నీరాజన మంత్రపుష్పములు సమర్పించి అద్దాల మండపమునందు పుష్పోత్సవం, పవళింపుసేవ చేస్తారు. ఈ కళ్యాణం వేడుక ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కళ్యాణంలో పాల్గొనదలచిన వారు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆలయానికి చెందిన అధికారిక వెబ్ సైట్ లో ముందుగానే బుక్ చేసుకొని వెళ్లొచ్చు.


🌻 నిత్యకళ్యాణంతో పాటు ఇక్కడ జరిగే మరిన్ని పూజ కార్యక్రమాలు.. 🌻

పంచామృతాలతో ప్రథమాభిషేకం ఉదయం 5.30 గంటలకు జరుగుతుంది. 150 రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చు. పుష్కర నదీ జలాభిషేకం సేవ జరుగుతుంది. వీటితో పాటు అన్ని రకాల ఆర్జిత సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే శివరాత్రి, మాస శివరాత్రి, కార్తీక మాసం, సోమవారం.. ఇలా శివుడికి ప్రీతి పాత్రమైన రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఉంది. అలాగే ఆలయం ఆధ్వర్యంలోనే ఓ గోకులాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ గోదావరి నదిని సందర్శించొచ్చు. ఈ నది వద్ద పితృ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.

ప్రతిరోజు ఉదయం 5.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెరుస్తారు. సోమవారం మాత్రం ఉదయం 5 గంటలకే ఆలయం తెరుస్తారు.

ఈ ఆలయంకు ట్రైన్, బస్ లలో కాకినాడ లేదా అమలాపురం చేరుకుంటే అక్కడ్నుంచి బస్సు సర్వీసులు ఉంటాయి. అమలాపురం నుంచి కాకుండా వైపు, కాకినాడ నుంచి అమలాపురం వైపు వెళ్లే బస్సులు ఎక్కితే మురమళ్ళ గోదావరి బ్రిడ్జ్ వద్ద దిగితే అక్కడ్నుంచి ఆలయం వద్దకు ఆటోలు ఉంటాయి.

ఇక్కడ నుంచి దగ్గర్లో ప్రముఖ శివాలయం పార్వతి సమేత శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయం కుండలేశ్వరంలో గోదావరి నదీ తీరాన ఉంది. మరో వైపు యానాం కూడా దగ్గర్లోనే ఉంటుంది.

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment