నవ దుర్గల ఆరాధన - నవమ దుర్గ – సిద్ధిదాత్రి దేవి (Worship of the Nine Durgas – The Ninth Durga – Goddess Siddhidatri)



https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2283520862434382


🌹🔱 9. నవ దుర్గల ఆరాధన - నవమ దుర్గ – సిద్ధిదాత్రి దేవి – మహిషాసురమర్దిని దేవి విశిష్టత, ప్రార్థనా శ్లోకాలు, ఆరాధనా విధానం - పురాణ కధ, సాధన 🔱🌹

🕉 మహర్నవమి శుభాకాంక్షలు అందరికి Maharnavami Greetings to All 🕉

✍️ ప్రసాద్ భరద్వాజ


🌹🔱 9. Worship of the Nava Durgas (Nine Forms of Durga) – The Ninth Durga: Goddess Siddhidatri – The Significance of the Destroyer of Mahishasura (Mahishasuramardini), Prayers (Shlokas), Methods of Worship, Mythological Legend, and Spiritual Practice 🔱🌹

🕉 Best wishes to everyone on the occasion of Maharnavami! 🕉

✍️ Prasad Bharadwaj



ఆరాధనా దినం: తొమ్మిదవ రోజు | సంప్రదాయ రంగు: ఊదా

సిద్ధిదాత్రి నవదుర్గలలో తొమ్మిదవ స్వరూపం. అష్టసిద్ధులను ప్రసాదించే దేవతగా ఈమె ప్రసిద్ధి చెందింది. పద్మంపై ఆసీనురాలై, నాలుగు హస్తాలలో శంఖం, చక్రం, గద, పద్మాన్ని ధరించిన రూపంలో వర్ణించబడుతుంది.

మహిషాసురమర్దిని అలంకారంలో అమ్మవారిని సింహవాహినిగా, ఆయుధధారిణిగా, మహిషాసురుని సంహరించే వీరస్వరూపంలో అలంకరిస్తారు. ఈ అలంకారం అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని, అంతర్గత శక్తి మేల్కొలుపును సూచిస్తుంది.


🌼 సిద్ధిదాత్రి ప్రార్థనా శ్లోకం

ద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి ।
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥


భావం: సిద్ధులు, గంధర్వులు, యక్షులు, దేవతలు ఆరాధించే సిద్ధిదాత్రీదేవి మాకు ఆధ్యాత్మిక పరిపక్వతను, జ్ఞానాన్ని, సాధనలో విజయాన్ని ప్రసాదించుగాక.

అలంకారం: మహిషాసురమర్దిని దేవి – ముదురు ఎరుపు రంగు



🌼 మహిషాసురమర్దిని ప్రార్థన

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా ।
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ॥

భావం: సమస్త జీవులలో శక్తిరూపంగా నివసించే ఆ జగన్మాతకు పదేపదే నమస్కరిస్తున్నాము.

నైవేద్యం: పులిహోర, పరమాన్నం లేదా సంప్రదాయానుసారమైన ప్రసాదం.



🌷 పురాణ కధ - సాధన

తొమ్మిదవ శక్తి స్వరూపమైన సిద్ధిధాత్రి సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది. ఈమె కరుణవల్లే పరమేశ్వరుని అర్ధశరీర భాగాన్ని పార్వతీ దేవి సాధించినట్టు పురాణకథనం. ఈ దేవతను ప్రసన్నం చేసుకోవడానికి నేడు కన్యా పూజను కూడా చేస్తారు.

దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం ‘సిద్ధిదాత్రి’. ఈమె సర్వవిధ సిద్ధులనూ ప్రసాదిస్తుంది. మార్కండేయ పురాణంలో 1) అణిమ, 2) మహిమ, 3) గరిమ, 4) లఘిమ, 5) ప్రాప్తి, 6) ప్రాకామ్యము, 7) ఈశిత్వము, 8) వశిత్వము అని సిద్ధులు ఎనిమిది రకాలుగా పేర్కొన బడ్డాయి.

బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మ ఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా తెలుపబడ్డాయి. అవి…


1) అణీమ, 2) లఘీమ, 3) ప్రాప్తి, 4) ప్రాకామ్యము, 5) మహిమ, 6) ఈశిత్వ వశిత్వాలు, 7) సర్వకామావసాయిత, 8) సర్వజ్ఞత్వం, 9) దూరశ్రవణం, 10) పరకాయ ప్రవేశం, 11) వాక్‍సిద్ధి, 12) కల్పవృక్షత్వం, 13) సృష్టి, 14) సంహారకరణ సామర్థ్యం, 15) అమరత్వం, 16) సర్వన్యాయకత్వం, 17) భావన మరియు 18) సిద్ధి.

సిద్ధిదాత్రి మాత భక్తులకూ, సాధకులకూ ఈ సిద్ధులన్నింటిని ప్రసాదించగలదు. పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులను దేవి కృపవలననే పొందారని దేవీ పురాణం పేర్కొంటుంది. ఈ సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ. సింహవాహన. ఈ దేవీ స్వరూపం కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది. మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్నీ, మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి దర్శనమిస్తుంది.

నవదుర్గల్లో ‘సిద్ధిదాత్రి’ అవతారం చివరిది. మొదటి ఎనిమిది రోజుల్లో క్రమంగా దుర్గాదేవి ఎనిమిది అవతారాలను విద్యుక్తంగా నిష్ఠతో ఆరాధించి, తొమ్మిదవ రోజు ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావాలి. ఈ దేవిని ఉపాసించడం వల్ల భక్తుడు అన్ని విధాలైన సాంసారిక వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీ దేవి దివ్య లోకంలో విహరిస్తాడు. ఆ దేవీ కృపారసామృతం నిరంతరంగా ఆస్వాదిస్తూ, విషయ భోగ విరక్తుడవుతాడు. అట్టి వారికి భగవతీ దేవి సాన్నిధ్యమే సర్వస్వంగా ఉంటుంది. ఈ పరమ పదాన్ని పొందిన వెంటనే అతనికి ఇతరాలైన ప్రాపంచిక వస్తువుల అవసరం ఏ మాత్రం ఉండదు.

నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది.

దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. భగవతీ మాత స్మరణ, ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం నిస్సారమని మనకు బోధ పడుతుంది. తన్మహత్త్వాన నిజమైన పరమానందదాయకమైన అమృత పథం మనకు ప్రాప్తిస్తుంది.


🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment